Aug 13,2023 21:31

ఉమ్మడి జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్‌ సూర్యచక్రవేణి
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను, బాలలతో భిక్షాటనను, బాల్య వివాహాలను, బాలల అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్‌ సిహెచ్‌.సూర్య చక్రవేణి తెలిపారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ ఎంతమంది బాల కార్మికులను గుర్తించారు, ఎన్ని బాల్య వివాహాలను అడ్డుకున్నారు, బాలల సంరక్షణకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వంటి ప్రశ్నలకు ప్రజాశక్తి ముఖాముఖిలో ఆమె సమాధానాలిచ్చారు.
ప్రశ్న : మహిళా శిశు సంక్షేమ శాఖలో బాలల సంరక్షణ అధికారి ముఖ్య విధులు ఏంటి?
ముఖ్యంగా 18 ఏళ్లలోపు బాలబాలికలకు ఇంటిలో, బడిలో, సమాజంలో ఏ కష్టం వచ్చినా బాలల న్యాయ చట్టం ప్రకారం వారికి న్యాయం చేయడం, వారి హక్కులను కాలరాసే వారిపై చర్యలు తీసుకోవడం మా శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం మిషన్‌ వాత్సల్య పేరుతో ప్రత్యేక కార్యక్రమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
ప్రశ్న : బాలకార్మికుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? ఇప్పటివరకూ ఈ సంవత్సరం ఎంతమంది బాల కార్మికులను గుర్తించారు?
బాల కార్మికుల నిర్మూలనకు నెల రోజులపాటు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాము. ఈ డ్రైవ్‌ లో భీమవరం, ఏలూరు ప్రాంతాల నుంచి 36 మంది బాలకార్మికులను గుర్తించి వారిని వివిధ పాఠశాలల్లో చేర్పించడం జరిగింది. కార్మిక శాఖ వీరిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వీరి బాగోగులు చూడటం జరుగుతుంది.
ప్రశ్న : బాల్యవివాహాల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ సంవత్సరం ఎన్ని బాల్యవివాహాలను నిలుపుదల చేసి, కేసులు నమోదు చేశారు?
బాల్య వివాహాల నిరోధాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇటీవల జిఒ31ని విడుదల చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆర్‌డిఒ నోడల్‌ అధికారులుగా ఉండి నెలనెలా ఈ కార్యక్రమంపై సమీక్ష చేయటం జరుగుతుంది. అలాగే గ్రామాల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి, మహిళా సంరక్షణ కార్యదర్శి ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల్లో సమాచారాన్ని సేకరించి 18 సంవత్సరాలలోపు బాల బాలికలు కచ్చితంగా చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నాము. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి 19 బాల్య వివాహాలను గుర్తించాము. ఐదు వివాహాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాము.
ప్రశ్న : జిల్లాలో ఇప్పటి వరకూ ఎన్ని పోక్సో కేసులు నమోదు చేశారు?
ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకూ 12 పోక్సో కేసులు నమోదు చేశాము. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఆ కేసులను పోలీసు శాఖ ద్వారా చేపట్టాము.
ప్రశ్న : ఈ సంవత్సరం ఎంతమంది పిల్లలను దత్తత ఇచ్చారు? దత్తత తీసుకోవాలంటే ఎలాంటి నిబంధనలుంటాయి?
జిల్లాలో ఈ సంవత్సరం ఎనిమిది మంది పిల్లలను దత్తత ఇచ్చాము. పిల్లలను దత్తత తీసుకోవాలంటే ముందుగా ఎవరైతే పిల్లలు కావాలని అనుకుంటున్నారో వారి వివాహ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, వయస్సు, ఆదాయం, ఆరోగ్య పరిస్థితి తదితర డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ ఏజన్సీ నుంచి పిల్లను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ ఏజన్సీని సెలెక్ట్‌ చేసుకోవాలి. వారి డాక్యుమెంట్లు మాకు అందిన తర్వాత 30 రోజుల్లో వారి ఇంటికి వెళ్లి అన్నివివరాలు విచారించి సరిగ్గా ఉంటే మళ్లీ మేము ఆ వివరాలు సంబంధిత పోర్టల్‌లో అప్లోడ్‌ చేస్తాము. ఆ తర్వాత సీనియార్టీ ప్రకారం వారివంతు వచ్చినప్పుడు వారికి కబురు చేసి, వారు వచ్చి చూసుకుని పిల్లల నచ్చితే తాత్కాలికంగా వారికి అప్పగిస్తాము. తరువాత 60 రోజుల్లో వారు జిల్లా కలెక్టర్‌ ముందు హాజరైతే అన్ని చూసుకుని సరిగ్గా ఉంటే వారికి పర్మినెంట్‌గా దత్తత ఇస్తాము.
ప్రశ్న:6 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలను సంరక్షించే బాలసదన్‌లు జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి? వారిని ఎవరు దత్తత తీసుకోవడానికి ముందుకు రాకపోతే వారిని ఏం చేస్తారు?
జిల్లాలో బాలసదన్‌లు దెందులూరు నూజివీడు తణుకు ఆకివీడు ప్రాంతాల్లో ఉన్నాయి. పెద్ద పిల్లలను ఎవరు దత్తత తీసుకోవడానికి ముందుకు రాకపోతే వారిని కస్తూరిబా బాలిక పాఠశాలలో చదివించడం జరుగుతుంది. చదువుతోపాటు వివిధ నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగం వచ్చేవరకూ మేమే సంరక్షించడం జరుగుతుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత వారికి ఇష్టం అయితే మేమే వివాహం కూడా చేయడం జరుగుతుంది. లేకపోతే వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్లో ఉంచి పర్యవేక్షించడం జరుగుతుంది.
ప్రశ్న : జిల్లాలో ఇటీవల బాలల భిక్షాటన ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటివరకూ ఎంతమందిని గుర్తించారు?
బాలల భిక్షాటన అరికట్టేందుకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌తో కలిసి అప్పుడప్పుడు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు విద్యాశాఖ కూడా బాధ్యతవహించి బాలల భిక్షాటనను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించాము. జిల్లాలో ఇప్పటివరకూ 40 మందిని గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాము.
ప్రశ్న : బాల కార్మికవ్యవస్థ, బాల్య వివాహాలు, బాలల భిక్షాటనను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చివరిగా ప్రజలకు మీరిచ్చే సూచన ఏంటి?
మన దేశంలో ప్రతి పౌరుడికీ హక్కులున్నట్టే బాలలకు కూడా కొన్ని ప్రత్యేక హక్కులున్నాయి. బాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ బడిబయట ఉండకూడదు. బాలలతో భిక్షాటన చేయించటం, బాలలను పనిలో పెట్టుకోవడం, బాల్యవివాహాలు చేయడం నేరం. దీన్ని అరికట్టడం ప్రతి పౌరుడూ తమబాధ్యతగా అనుకోవాలి. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు కనిపిస్తే 1098 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారమిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. గతంలో ఈ నంబరు ఎన్‌జిఒ అధీనంలో ఉండేది. ఇప్పుడు మా శాఖ అధీనంలోకి వచ్చింది కాబట్టి ఎవరైనా సమాచారమిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుని బాలల హక్కులు కాపాడేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తున్నాము.