Nov 11,2023 19:46

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ కేసలి

ప్రజాశక్తి-విజయనగరం కోట :  బాలలకు భద్రత కల్పించి, వారి హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. చైల్డ్‌ రైట్స్‌ అడ్వకేసి ఫౌండేషన్‌ ఆధ్వర్యాన బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని రూపొందించిన గోడపత్రికను కోలగట్ల వీరభద్రస్వామితో పాటు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ కేసలి అప్పారావు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని వారి హక్కులుకు భంగం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాలలు విద్య, వైద్యం కోసం అనేక అభివృద్ధి కార్య్రమాలు చేపడుతోందన్నారు. ప్రాధాన్యత ఇచ్చి అధిక నిధులను కేటాయిస్తుందని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలల్లో నూతన తరగతులు నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీరు, మౌళిక సదుపాయాలు కల్పించడం, డిజిటల్‌ తరగతులు, ఇంటర్నెట్‌ సదుపాయాలు, టాబ్‌ లు పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. కేసలి అప్పారావు మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 20 తేదీ వరకు బాలలు హక్కులు వారోత్సవాలు రాష్ట్రమంతటా అందరి సహకారంతో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ ఎస్‌వి రాజేష్‌, కార్పొరేటర్లు ధనలక్ష్మి, సత్యనారాయణ, జిల్లా బాలల సంరక్షణ విభాగం ఇంఛార్జి అధికారి యాళ్ల నాగరాజు, మిషన్‌ వాత్సల్య సిబ్బంది, వైసిబి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.