ప్రజాశక్తి- సీతమ్మధార : నగరంలో బాలల అక్రమ దత్తత, బాల్య వివాహాల నిర్మూలన దిశగా నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్లలో కేసులు నమోదుకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ చిరువోలు శ్రీకాంత్ అన్నారు. ఎపి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ గొండు సీతారాం నగర పర్యటనలో భాగంగా గురువారం సిపి ఛాంబర్‌లో శ్రీకాంత్‌తో భేటీ అయ్యారు. నగరంలో బాలల హక్కులు, వారి పరిరక్షణలో భాగంగా ఇటీవల కమిషన్ దృష్టికి వచ్చిన పలు విజ్ఞాపనలు, ఫిర్యాదులు, తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, బాల్యవివాహాలు, అక్రమ దత్తతలు, పోక్సో కేసులపై సత్వర చర్యలు చేపట్టేందుకు వీలుగా వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు అవగాహన కలిస్తామని, దీనికి సంబంధించిన ఫిర్యాదులపై శతశాతం కేసుల నమోదుక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పోలీసులు, ప్రభుత్వేతర సంస్థల సహకారంతో బాల యాచకుల నిర్మూలనకు నిర్ధేశించిన జిఒ 26 పటిష్ట అమలుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. బాలల హక్కుల కమిషన్ సూచనల మేరకు నగరంలోని పాఠశాలలు, ముఖ్యకూడళ్లలో సివిల్ పోలీసులు, మహిళ రక్షణ కార్యదర్శులతో ప్రత్యేక నిఘా పెడతామన్నారు. ఆడపిల్లలను వేధించే ఆకతాయిలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వారిని, వారిని ప్రోత్సాహిస్తున్న వారిని విడిచిపెట్టేది లేదన్నారు. దీనిపై సీతారాం స్పందిస్తూ, తాము సూచించిన సమస్యల పరిష్కారానికి పోలీసుశాఖ అండగా ఉంటుందని సిపి శ్రీకాంత్ భరోసానివ్వడంపై హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమంలో డిసిపి సునీల్, జిల్లా ప్రొబేషనరీ అధికారి శరత్, సిఆర్‌పిఎఫ్ సైకాలజీ విభాగం ప్రధాన కార్యదర్శి సీతారామకృష్ణ పాల్గొన్నారు.










