Nov 14,2023 23:48

చిన్నారులకు కేక్‌ తినిపిస్తున్న కలెక్టర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా, ఇతర ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి-గుంటూరు : నవభారత నిర్మాతలైన బాలలకు సంతోషకరమైన, భద్రమైన బాల్యాన్ని, మంచి విద్యను, పౌష్టికాహారాన్ని అందించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు, జిల్లా స్థాయి బాలల దినోత్సవంలో కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డితోపాటు జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌ పాల్గొన్నారు. తొలుత జవహర్‌లాల్‌ నెహ్రు చిత్రపటానికి పూలమాలవేశారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా బాలల హక్కుల రక్షణపై రూపొందించిన ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, పౌష్టికాహారం, నిర్భంద ఉచిత విద్య అమలు తీరును సమీక్షంచటానికి ప్రతి సంవత్సరం అన్ని దేశాలలో బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలలంటే ప్రత్యేక మక్కువ కలిగిన భారతదేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రు జన్మదినం సందర్భంగా మన దేశంలో నవంబరు 14వ తేదీన బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని వివరించారు. క్రిస్టినా మాట్లాడుతూ బాలల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. చక్కని విద్యను, పౌష్టికాహారంను అందిస్తూ ప్రతి ఒక్కరి సర్వతోభివృద్ధికి జగన్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు, మూడవ తరగతి విద్యార్థిని తనిష్క్‌ 190 దేశాల జాతీయ జెండాల ఫొటోలు చూసి గుర్తుపట్టే ప్రదర్శన అహుతులను ఆకట్టుకున్నాయి. జిల్లా నుంచి బాలల పురస్కార అవార్డుకు ఎంపికైన మల్లాది సింధు రాజేశ్వరి, మల్లాది శివనందయసశ్విని, బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు, మహిళ సేవా కార్యకర్తలకు కలెక్టర్‌, ప్రజా ప్రతినిధులు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌, నగర డిప్యూటీ మేయర్‌ సజీలా, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చందోలు విజయకుమార్‌, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారి ఉమాదేవి, సీడబ్య్లుసీ చైర్‌ పర్సన్‌ ప్రమీలా, జిల్లా ప్రొబిషన్‌ అధికారి బీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.