Sep 26,2023 22:03

విచారణ చేస్తున్న డిఎస్‌పి శ్రీధర్‌, సిఐ అప్పలనాయుడు

ప్రజాశక్తి-మెంటాడ :   మండలంలోని లోతుగెడ్డ గ్రామంలో అమానుషం చోటుచేసుకుంది. దళిత బాలికపై అదే గ్రామానికి నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడాదిగా జరుగుతున్న ఈ దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆండ్ర పోలీసులు తెలిసిన వివరాలు ప్రకారం. లోతుగెడ్డ దళిత కాలనీకి చెందిన పదో తరగతి విద్యార్థినిని స్థానిక యువకులు కొందరు కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నారు. బెదిరించి లొంగదీసు కున్నారు. ఏడాది గా ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఆ బాలిక తల్లిదండ్రులు గొడవలు పడి కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారు. దీంతో, బాలిక అమ్మమ్మ సంరక్షణలో ఉంటోంది. కొద్ది రోజులుగా ఆ బాలిక ప్రవర్తనలో మార్పును అమ్మమ్మ గమనిస్తోంది. ముభావంగా ఉండడం తో అనుమానం వచ్చి అమ్మమ్మ ప్రశ్నించడంతో బాధిత బాలిక విషయాన్ని చెప్పింది. దీంతో, అమ్మమ్మ ఈ విషయాన్ని కులపెద్దలు, గ్రామపెద్దల దృష్టికి తీసుకు వెళ్ళగా, వారు ఆ నలుగురు యువకుల తల్లిదండ్రులకు చెప్పి హెచ్చరించారు. బాధితురాలు రెండ్రోజుల క్రితం ఆండ్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బొబ్బిలి డిఎస్‌పి శ్రీధర్‌, సిఐ అప్పలనాయుడు మంగళవారం దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులైన నలుగురు యువకులు కూడా 16 సంవత్సరాల వయసు వారే కావడం గమనార్హం. పోలీసుల అదుపులో ముగ్గురు వుండగా,. ఒకరు పరారీలో ఉన్నారు.