
ఐద్వా ఆధ్వర్యంలో నిరసనలు
ప్రజాశక్తి - భీమవరం
భీమవరం గాంధీనగర్ ప్రాంతంలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కొత్తపల్లి సుబ్బారాయుడు పాఠశాలలో ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడుతూ మహిళలు, బాలికలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. తక్షణం ఈ అమానుషానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ ఎం రాజు బాలికలు పాల్గొన్నారు.
భీమవరంలో 14 ఏళ్ల బాలిక హత్యకు గురి కావడం పట్ల సిపిఎం జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సొంత బాబాయే కిరాతకుడై హత్య చేయడం సభ్యసమాజం నివ్వెరపోయేలా చేసిందని తెలిపారు. బాలిక అత్యాచారానికి సైతం గురై ఉండొచ్చన్న వైనం మాటల కందని దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రధాని బేఠీ బచావో, రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న దిశ చట్టాలు బాలికలను సైతం కాపాడలేకపోవడం సిగ్గుచేటని తెలిపారు. దోషిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా విచారించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి, భూమి ,నష్టపరిహారం, గహం అందించి ఆదుకోవాలని కోరారు.
తాడేపల్లిగూడెం : బాలికను హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఐద్వా ఆధ్వర్యంలో ఇటుకలగుంట గ్రామంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా మండల అధ్యక్షురాలు పాలు పూరి సత్యవతి మాట్లాడారు. అత్యాచారం చేసిన దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు పాలుపూరి వెంకయ్యమ్మ, మల్లిపూడి సీతామహాలక్ష్మి, పి.ధనలక్ష్మి, మాగంటి వెంకటరమణ మాట్లాడారు. అలాగే ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గూడెం పోలీసు ఐల్యాండ్ వద్ద నిరసన చేపట్టారు. ఐద్వా పట్టణ అధ్యక్షులు మీసాల పావని, కార్యదర్శి బి.యశోద హాజరయ్యారు. యశోద మాట్లాడారు.
నరసాపురం టౌన్ : బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన మావుళ్లును కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా కమిటీ కోరింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడారు. కొత్తపల్లి సుబ్బారాయుడు స్కూల్లో నిరసన తెలిపారు.
భీమవరం రూరల్ : బాలికలు, యువతులపై అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకూ పెరుగుతున్నా మహిళా కమిషన్ స్పందించడం లేదని, ఎపి మహిళా కమిషన్ ఏమైందనిీ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు డాక్టర్ శీరిగినీడి రాజ్యలక్ష్మి ప్రశ్నించారు. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష వద్ద ఉన్న బాలిక తల్లిదండ్రులను ఆమె పరామర్శించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధి, రాష్ట్ర కార్యదర్శి వెండ్ర శ్రీనివాస్ నేతలు పాల్గొన్నారు.