ప్రజాశక్తి-తెనాలి : మితిమీరిన వేగం ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాన్ని బలిగొంది. ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతూ చిన్నారిని ఢకొీట్టడంతో తీవ్రంగా గాయపడిన బాలికను తెనాలి వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం జయవాడ తరలించగా ఆదివారం తెల్లవారుజామున మృత్యువాత పడింది. మండంలోని జగ్గడిగుంటపాలెంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంపై స్థానికులు, పోలీసుల వివరాలు ప్రకారం.. హైదరాబాదులో ఉంటున్న బాలిక రూకియా (8) బక్రీద్ పండుగ నిమిత్తం జగ్గడిగుంటపాలెంలోని అమ్మమ్మ తాతయ్యల ఇంటికి తల్లితో వచ్చింది. శనివారం అర్ధరత్రి బాలిక తల్లి తిరిగి హైదరాబాదు పయనమైంది. ఆమెను పంపించేందుకు అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి బాలిక రోడ్డు దాటుతుండగా అదే ప్రాంతానికి చెందిన జీవన్ దేవ్, సుబ్బు అనే ఇద్దరు యువకులు మితిమీరిన వేగంతో బైక్ పై వచ్చి రోడ్డు దాటుతున్న చిన్నారిని ఢకొీట్టారు. అపస్మారకస్థితికి వెళ్లిన బాలికను కుటుంబ సభ్యులు తొలుత తెనాలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. బాలిక పరిస్థితి విషమించడంతో రాత్రికి రాత్రి విజయవాడ తరలించారు. చికిత్స పొందుతున్న బాలిక ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
తెనాలి-చందోలు రహదారిపై ఆందోళన..
ఇదిలా ఉండగా బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆదివారం రాత్రి తెనాలి-చందోలు రహదారిపై జగ్గడిగుంటపాలెం వద్ద ఆందోళనకు దిగారు. నడిరోడ్డుపై ఆందోళనకారులు పెద్ద ఎత్తున టైర్లు కాల్చారు. నిందితులను తమకు అప్పగించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగడంతో ఆందోళన విరమింప చేసినందుకు పోలీసులు ఆందోళన కారులతో మాట్లాడుతున్నారు.
బాధిత కుటుంబానికి ఆలపాటి పరామర్శ..
ఘటన వివరాలను తెలుసుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం రాత్రి జగ్గడిగుంటపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా తమకు తీరని అన్యాయం జరిగిందంటూ బాలిక కుటుంబ సభ్యులు ఆయన వద్ద ఘొల్లుమన్నారు. ఈ సందర్భంగా ఆయన డీఎస్సీ బి.జనార్థనరావు, సబ్ కలెక్టర్ గీతాంజలిశర్మ తో మాట్లాడి, నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు.










