
ప్రజాశక్తి-కలెక్టరేట్ (విశాఖ) : బాలికలు, మహిళలపై హింస, వేధింపులు పెరిగాయని, వీటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ జి.ప్రియాంక ఆరోపించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బాలికలు, మహిళలపై హింస అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, విశాఖ జిల్లాలో మద్యం, మత్తు పదార్థాలు విచ్చలవిడి అమ్మకాలతో మహిళల పట్ల హింస నానాటికి పెరుగుతుందన్నారు. మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, మహిళల సమస్యల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని, మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. అనంతరం గంగవరంలో కన్న తండ్రి కారణంగా గర్భవతి అయిన బాలికకు న్యాయం చేయాలని కోరుతూ ఐద్వా బృందం స్పందనలో కలెక్టర్‌ను కలవగా, ఇద్దరు అక్కచెల్లెలు విద్య బాధ్యత ప్రభుత్వం చూస్తుందని, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు వేణు, భారతి, జి.వరలక్ష్మి, కె కుమారి, పుష్పాంజలి, కె.మణి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.