Jan 25,2023 23:51

మాట్లాడుతున్న ఎస్‌పి గౌతమిశాలి

ప్రజాశక్తి- సబ్బవరం
బాలికలు ఏ విషయం బాలుర కంటే తక్కువ కాదని, అనేక మంది ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీలను స్ఫూర్తిగా తీసుకుని ఆకాశమే హద్దుగా ఎదగాలని జిల్లా ఎస్‌పి గౌతమి శాలి సూచించారు. స్థానిక దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలో సెంటర్‌ ఫర్‌ చైల్డ్‌ అండ్‌ లా ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్‌పి మాట్లాడుతూ నేటి పరిస్థితులలో బాలికలు, స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించారు. ఎపి ప్రభుత్వం బాలికలు, స్త్రీల సంరక్షణ కోసం దిశా యాప్‌ను ప్రవేశ పెట్టారని, దీనిని అందరూ డౌన్లోడ్‌ చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు. బాలికలు, స్త్రీలు ఏ పరిస్థిలోనైనా అభద్రతగా అనిపించినపుడు యాప్‌ను నొక్కినట్లైతే అతి తక్కువ సమయంలో పోలీస్‌ సహాయం పొందగలరని తెలిపారు. విద్యార్థులు అడిగిన అనేక మైన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వ విద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎస్‌ సూర్యప్రకాష్‌ మాట్లాడుతూ బాలిక సంరక్షణ మనందరి బాధ్యత అని తెలిపారు. నేడు అన్ని రంగాలలో బాలికలు ఎంతో ముందంజలో ఉన్నారన్నారు. నేటి బాలికలే రేపటి స్త్రీలు అని, బాలికలు, స్త్రీల హక్కులను కాపాడుతూ వారిని గౌరవించినపుడే భవిష్యత్తు సమాజం అభివృద్ధి పథంలో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య మధుసూదనరావు, సెంటర్‌ ఫర్‌ చైల్డ్‌ అండ్‌ లా ఇన్‌చార్జి ఆచార్య విజయలక్షి , అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.