అనంతపురం కలెక్టరేట్ : ఆత్మకూరు మండలం, తలుపూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 1, 2 తరగతుల బాలికలపై వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఐద్వా, మహిళా సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐద్వా, జెవివి, మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో కలెక్టర్ ఎం.గౌతమి, ఎస్పీ కెకెఎన్.అన్బురాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, జెవివి జిల్లా గౌరవాధ్యక్షురాలు డాక్టర్ ప్రసూన, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పార్వతి మాట్లాడుతూ తలుపూరు గ్రామ ప్రాథమిక పాఠశాలలో 1,2 తరగతులు చదువుతున్న బాలికలను కొంత కాలంగా జోష్‌కుమార్ అనే ఉపాధ్యాయుడు అసభ్యకరమైన పద్ధతుల్లో బాలికలను వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు. నాలుగు నెలల ముందు ఈ విషయం గ్రామస్తులకు తెలిసిందన్నారు. ఒక అమ్మాయి స్కూలుకు వెళ్లకుండా ఉండడంతో తల్లిదండ్రులు ఆ అమ్మాయిని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. పిల్లలకు ఆ ఉపాధ్యాయుడు బూతు సినిమాలు చూపించి, బూతు మాటలు నేర్పిస్తున్నట్లు తెలిసిందన్నారు. మద్యం తాగడంతో పాటు కొద్ది మంది పిల్లలకు తాపిస్తున్నాడని తెలిసిందన్నారు. పిల్లలు బట్టలు విప్పించి, లైంగిక అసభ్య చర్యలకు పాల్పడేటట్లు చేస్తున్నాడని తెలిపారు. ఈ విషయమై ఎంఇఒ, పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే ఉపాధ్యాయుడు జోష్‌కుమార్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా మరో పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపారని తెలిపారు. అక్కడ కూడా ఆయన ప్రవర్తన అలాగే ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ విషయాలపై ఆ గ్రామాన్ని మహిళా సంఘాలుగా తాము పరిశీలించామన్నారు. ఆ ఉపాధ్యాయుని చేష్టలకు భయపడి కొందరు వారి పిల్లలను మరో స్కూల్‌కు పంపినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇంతటి అమానవీయమైన ఈ సంఘటనపై అధికారులు నిష్పాక్షపాతంగా విచారణ జరిపి జోష్ కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడు చేసిన దారుణం బయటకు రాకుండా కప్పిపుచ్చేందుకు యత్నించిన విద్యాశాఖ, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు రామాంజినమ్మ, అయేషా తదితరులు పాల్గొన్నారు.