May 17,2023 00:03

మాట్లాడుతున్న ఎఎస్‌పి జగదీష్‌

- ఎఎస్‌పి జగదీష్‌
ప్రజాశక్తి-రాజవొమ్మంగి

పాఠశాలల్లో బాలికలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు రంపచోడవరం ఏఎస్పీ జగదీష్‌ అడహల్లి తెలిపారు. ఇటీవల జడ్డంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులను అదే పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఫిర్యాదులపై మంగళవారం ఎఎస్‌పి జగదీష్‌ దర్యాప్తు నిర్వహించారు. అనంతరం ఆయన జడ్డంగి పోలీస్‌ స్టేషన్లో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌ అనే అంశంపై పోలీసులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో ఇటీవల జడ్డంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరిగినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇకపై సచివాలయ మహిళా పోలీసుల ద్వారా ప్రతి పాఠశాలలో క్రమం తప్పకుండా ఈ అంశంపై అవగాహన కల్పిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. జడ్డంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులపై బాధిత విద్యార్థినులు లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారని, వారికి ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాలను అందులో తెలియజేశారని పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో పాఠశాల హెచ్‌ఎం, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల నుండి కూడా వివరాలు సేకరించినట్లు తెలిపారు. నిందితులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు వారిపై పోక్సో కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజవొమ్మంగి సీఐ బాజీలాల్‌, జడ్డంగి ఎస్‌ఐ షరీఫ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.