ప్రజాశక్తి - ఆరిలోవ : బాలికలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ కేసలి అప్పారావు, కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖ, జన శిక్షణా సంస్థాన్ ఆధ్వర్యంలో విశాఖ వేలీ స్కూల్ ప్రక్కనున్న ప్రభుత్వ బాలికల హోమ్‌లో విద్యార్థులకు మూడు నెలల ఉచిత కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సు శిక్షణ తరగతులను జ్యోతిప్రజ్వళనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ అప్పారావు మాట్లాడుతూ, బాలికల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసేలా జనశిక్షణ సంస్థాన్ ముందుకొచ్చి ఇలాంటి శిక్షణలను ఇవ్వడం అభినందనీయమన్నారు. కమిషన్ సభ్యులు గొండు సీతారాం మాట్లాడుతూ ఈ హోమ్‌లో మరిన్ని వత్తి విద్యా కోర్సులు నేర్చుకునేలా కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో సిడబ్లూసి చైర్‌పర్సన్ ఎంఆర్‌ఎల్.రాధ, జన శిక్షణ సంస్థాన్ డైరెక్టర్ సిహెచ్.అప్పలనాయుడు, జిల్లా ఇన్‌ఛార్జి బాలల సంరక్షణాధికారి బి.మమత, హోం పర్యవేక్షణాధికారి సునీత, జన శిక్షణ సంస్థాన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్లు కెఎల్ మనోహర్, డి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.










