
దసరా వచ్చింది అంటే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకూ తెగ సరదా పడిపోతారు.. సంబరాలు చేసుకుంటారు. పండుగ అంటే సంతోషంగా.. సందడిగా ఉంటేనే కదా! అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ ఆనందమే వేరు.. ఆ సందడే వేరు.. పండుగ అంటే కలిసి పిండివంటలు చేసుకుని ఆరగించడమే కాదు.. దసరా అనగానే బోలెడు సెలవులు.. 'పల్లెకు పోదాం చలో చలో' అంటూ అమ్మమ్మ నాన్నమ్మల ఊర్లకు పయనాలు.. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈసారి అలాంటి అవకాశాలు తక్కువనే చెప్పాలి. మూడో అల వచ్చేసిందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా.. ఆదిపరాశక్తి అంటూ ఆరాధిస్తూనే.. మన చుట్టూ.. మనతో ఉన్న స్త్రీల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాం? బాలికలను బతకనివ్వకుండా ఎంత రాక్షసంగా అడ్డుకుంటున్నాం? స్త్రీ శక్తి.. మహిళా సాధికారత గురించి పిల్లలకు ఎంతమందిమి చెప్పి ఉంటాం? అందుకే బాలికలను బతకనిచ్చి.. చదవనిచ్చి.. ఎదగనిచ్చి.. సాంకేతికంగా దూసుకుపోయేలా చేయడమే అసలైన దసరా.. బాలికల్ని విజయపథంలో నడిచేలా చేద్దాం..
ఈ నెల11వ తేదీ 'అంతర్జాతీయ బాలికల దినోత్సవం'..,
15వ తేదీ 'దసరా'.. నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం..
కోవిడ్ కాలంలో చాలారోజులు స్కూల్స్ లేకుండా.. ఎట్టకేలకు తెరుచుకున్నాయి. ఈ పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఇంటికి పరిమితమైన వారు స్కూలుకు వెళ్లడం మెల్లమెల్లగా అలవాటవుతున్నారో లేదో.. దసరా పండుగ సెలవులు వచ్చేశాయి.. పిల్లల ఆనందానికి రెక్కలు తొడిగినట్లే.. అయితే కరోనా మూడో అల ప్రమాదం పొంచే ఉంది. ఇప్పటికే కోవిడ్ ఎక్కడి వారిని అక్కడ కట్టడి చేస్తోంది. ఎన్ని ఆంక్షలున్నా.. జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ సెలవులు అనుభవించాలి.. అనుభూతి పొందాలి.. సాంస్కృతిక నేపథ్యమున్న ఈ పండుగకు ఈ సారి ఆ సందడి తక్కువే అని చెప్పాలి.
సందడి.. సరదా..

దసరా అంటేనే సందడి.. సరదా..! పండుగ అంటేనే పిల్లలకి ఎక్కడలేని ఆనందం.. స్కూలుకు వెళ్లకుండా ఇంటి దగ్గర స్నేహితులతో ఆడుకోవచ్చని.. కొత్తబట్టలు కొనుక్కోవచ్చనీ.. అమ్మ చేసే పిండివంటలు తినవచ్చనీ.. అబ్బో బోలెడు ఆఫర్లు.. అవన్నీ ఆస్వాదిస్తూ.. అనుభూతి పొందాలని ఒకటే ఉబలాటం.. అలాగే పిల్లలు ఎంత మంది ఉన్నా బంగారుతల్లి ఒక్క అమ్మాయి అయినా ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతుంది. అమ్మాయి కిలకిల నవ్వులు.. బుడి బుడి అడుగులు.. చెంగు చెంగున గంతులు.. అంతేనా.. నాన్నతో పోటీగా ఆయన చేసే పనులన్నీ చేయడం ఓ మురిపెం.. అంతేకాదు.. అమ్మాయిని తక్కువ చేసి చూడొద్దని తెలియజేయడం.. ఆ బుజ్జితల్లులు ఇంటి విషయాలు.. స్కూలు విషయాలు నాన్నతో చర్చించడం.. అమ్మానాన్నకు తట్టని కొన్ని సమస్యలను.. చిక్కుముళ్లని.. ఎంతో తేలికగా తేల్చేయడం.. గొప్ప ఆనందం. ఇదంతా.. వాళ్లల్లోని మేధస్సుకు ఓ నిదర్శనం.. ఆడపిల్లే అని చులకన చేయొద్దు మరి.. అందుకే ఆడపిల్లలు ప్రతి ఇంట్లో ఉండేలా చేయడం మన బాధ్యత.. సమాజం అభివృద్ధి కావాలంటే.. అమ్మాయిలూ అభివృద్ధి కావాలి. ఆ సమానతతోనే సమాజం ముందుకు పోతుంది.
ధీరత్వం..

దసరా అనగానే ధైర్యానికి.. దుష్ట సంహారానికి ప్రతీక. నారీ నాయకత్వానికీ నిలువెత్తు నీరాజనం. ఈ మధ్య హార్లిక్స్ అడ్వర్టయిజ్‌మెంట్‌లో తల్లి తన ఇద్దరు అమ్మాయిలతో కారు డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సడన్‌గా కారుకి పంక్చర్ అవుతుంది. తల్లి ఆందోళనతో వాళ్లకీ వీళ్లకీ ఫోనులు చేస్తూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న పెద్దమ్మాయి డిక్కీలోని టైర్ తీసుకుని, పంక్చర్ అయిన టైర్ స్థానంలో మారుస్తుంది. ఆ తల్లి తన కూతురు స్థయిర్యాన్ని, నైపుణ్యాన్ని, బలాన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. నిజజీవితంలో కూడా ఇది నిజమే. ఆడపిల్లలు చేయలేరని అనుకోవద్దు.. వాళ్లు లేని రంగం లేదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అంతేకాదు.. ఆయా రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ అమ్మాయిలు ఉన్నతంగా ఎదుగుతున్నారు. కానీ అనుక్షణం వాళ్లని అబల అంటూ.. ఆడపిల్ల అంటే అణుకువుగా ఉండాలని నూరిపోస్తున్నారు. ఇక రాజ్యం అయితే ఆడపిల్లల పట్ల దారుణంగా వ్యవహరిస్తోంది. ఎప్పుడూ లేని రీతిలో ఈ కరోనా కాలంలో దేశవ్యాప్తంగా కోటి మంది అమ్మాయిలకు బాల్య వివాహాలు జరిగాయని గణాంకాలు చెప్తున్నాయి.. ఓ వైపు అంతరిక్షంలోకీ అమ్మాయిలు అడుగులు వేస్తున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిణామాలు తిరోగమన భావాల పర్యవసానమే. అందుకే అమ్మాయి ధీర.. ఆమె ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా మనమంతా తోడ్పడాలి. ధైర్యవంతులుగా తీర్చిదిద్దాలి. స్వీయరక్షణ కోసం అవసరమైన మార్షల్ ఆర్ట్స్‌నూ నేర్పించాలి.అప్పుడు ఆడపిల్ల శక్తివంతురాలే.
రాజకీయాల్లో అయినా.. కుటుంబంలో అయినా నిర్ణయాత్మకశక్తి స్త్రీకి ఉందని బాలిక స్థాయిలోనే అవగాహన కలిగించాలి. ప్రోత్సహించాలి. నాయకత్వానికి స్త్రీ ఏమాత్రం తీసిపోదనీ.. ఆమెకు ఆ సామర్థ్యం ఉందనే చైతన్యం అందరిలో కలిగించాలి. మన కళ్ల ముందే ప్రభుత్వాలు నడుపుతున్న మహిళలను చూస్తున్నాం.. అనేక సంస్థలకు.. సంఘాలకు నాయకత్వం వహిస్తూ విజయాలు సాధిస్తున్న ధీరలు మనముందే ఉన్నారు. అంతెందుకు ఢిల్లీలో జరుగుతున్న రైతు మహోద్యమంలో స్త్రీ భాగస్వామ్యం అటు పోరాటాల్లోనూ.. ఇటు సేద్యం చేయడంలోనూ ఏవిధమైన సమన్వయం ఉందో చూస్తున్నాం.. ఇవే నేటి తరానికి నేర్పాల్సిన విషయాలు. నాయకత్వ పటిమను పెంపొందించాల్సిన నేపథ్యం.
సమానత
నాయకత్వం అనగానే సాధారణంగా పురుషులే స్ఫురిస్తారు. ఇది ఆధిపత్య భావజాలం వల్లే.. కానీ పురాణగాథలైనా.. నిజజీవితంలోనైనా అవకాశాలు అందాలేగానీ.. మహిళలు అద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శించగలరు. దుష్ట సంహారానికి దుర్గాదేవి నాయకత్వం వహించిందని దసరా సందర్భంగా గొప్పగా చెప్పే కథ. కానీ మన ఇంట్లో అమ్మాయిల్ని.. అబ్బాయిల్ని.. వేర్వేరుగా చూస్తారు. 'వాడు మగాడు..' అంటూ అబ్బాయిలు ఎక్కడ తిరిగినా ఫర్వాలేదనే పెంపకం చాలా నష్టం.. అది మన ఇంటి వరకే కాదు.. సమాజానికీ నష్టదాయకమే. అమ్మాయిలంటే బిక్కుబిక్కుమంటూ.. చీకటి పడగానే ఇంట్లో ఉండాలని.. అణుకువగా ఉండాలనే భేదభావం.. పిరికిమందులు నూరిపోయొద్దు. అమ్మాయైనా.. అబ్బాయైనా.. అన్యాయం జరిగితే ఎదిరించాలి.. మోసం చేస్తే ప్రశ్నించాలి.. అదే నేర్పాలి. సమానతను చాటాలి. ఆడపిల్లలు ఎందులోనూ తీసిపోరని తెలుసుకుని.. సమానావకాశాలు ఇవ్వాలి.. అలా అందుకున్నవారు అంతరిక్షం వరకూ ప్రయాణం చేయడం మన కళ్ల ముందున్న వాస్తవం. ఆడపిల్లలకు అసాధ్యం కానిదేమీ లేదు.. అందుకే అసమానతలు చూపకుండా.. అమ్మాయి, అబ్బాయి వేర్వేరు కాదంటూ.. సమానతా భావాన్ని పెంపొందిద్దాం.
విజ్ఞానం..

ఎందులో అయినా విజయం సాధించాలంటే అందుకు తెలివితేటలు ఉండాలి. తెలివితేటలు ఉండటం అంటే విజ్ఞానం కలిగి ఉండడం. విజయదశమి సంబరంగా జరుపుకోవడం అంటే ఆడపిల్లల విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే. ఆ వాస్తవాన్ని గ్రహించి.. విద్యలో.. విజ్ఞానంలో ఆడపిల్లల్నీ ముందుండేలా ప్రోత్సహించాలి. అసమాన ప్రతిభాపాటవాలు అమ్మాయిలు ఎలా చూపగలరో మనముందు ఇటీవల జరిగిన సివిల్స్ ఫలితాలు చూసినా.. వైద్యరంగంలో చూసినా..తేటతెల్లం అవుతుంది. ప్రాణాలను ఫణంగా పెట్టి.. గర్భవతిగా ఉండి కోవిడ్ పరిస్థితుల్లో వైద్య సేవలు అందిస్తూ ప్రాణాలు అర్పించిన మహిళా వైద్యులు, నర్సులే ఇందుకు సజీవ సాక్ష్యాలు. న్యాయవ్యవస్థలోనూ తమదైన ముద్రను ప్రతిబింబిస్తున్నారు. ఆటోల నుంచి విమానాల వరకూ అవలీలగా నడిపేస్తూ.. ఔరా అనిపిస్తున్నారు. ఇక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మేం తగ్గేదేలే అన్నట్లు దూసుకు వెళ్తున్నారు. నూతన ఆవిష్కరణలో అయినా.. అంతరిక్ష రంగంలో అయినా.. స్త్రీ భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతున్నాయనేది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల విజయాలను ఆకాంక్షిస్తూ.. వారికి విజ్ఞానసోపానాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. అవకాశాలు ఇచ్చి చూడండి.. వారెలా అభివృద్ధి చెందుతారో నిరూపిస్తారు. స్వేచ్ఛ ఇచ్చి చూడండి.. పక్షిలా సుదూరా తీరాలకు ధైర్యంగా వెళ్లి వస్తారు.
బాలికలని స్వశక్తివంతులుగా తీర్చిదిద్దడానికి విద్య ప్రధానమైన ఆయుధం. దీనవల్ల సామాజికంగా వెనుకబడిన నిరక్షరాస్యుల కుటుంబాల్లోంచీ అనేక మంది ఉన్నతులు తయారవుతారు. తమపై జరిగే హింసను, దాడులను తిప్పికొడతారు. బాలికలకు సాంకేతిక, వృత్తి విద్యా అవకాశాలు కల్పించాలి. అందుకు తగ్గ శిక్షణ ఇవ్వాలి. తమ జీవితాన్ని తాము ముందుకు తీసుకెళ్లేలా వృత్తి, జీవన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, రాజకీయ అంశాలపై అవగాహన పెంచాలి. తమను తాము రక్షించుకునే భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని అందుబాటులో ఉంచాలి. బాలురతో సమానంగా సరైన వనరులు, విద్యను అందించాలి.
ఆటంకాలు.. అవరోధాలు ఎవరికైనా ఎదురవుతాయి.. ఎన్ని అవరోధాలు వచ్చినా.. మూఢచారాలతో ఎన్ని మూర్ఖపు ఆంక్షలు పెట్టినా.. రాజ్యం తిరోగమన భావజాలం పేట్రేగుతున్నా.. 'తగ్గేదేలే' అంటూ అమ్మాయిలు ముందుకు దూసుకునే వెళుతున్నారు. ఆదిపరాశక్తి అంటూ ఆరాధిస్తున్న వాళ్లు.. ఆడపిల్లను గౌరవించడం నేర్చుకోవాలి. ఆమే ఓ మనిషేనని అర్థం చేసుకోవాలి. బతుకమ్మను ఎంత బాగా అలంకరించారనేది కాదు.. అమ్మ కడుపు నుండి బయటకి రానీయకుండా భ్రూణహత్యలకు పాల్పడుతున్న పరిస్థితుల్లో బాలికలను బతకనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం.. బాలకల్ని విజయపథంలో నడిపిద్దాం.. అదే అసలైన దసరా పండుగ అని చాటుదాం.
సాంకేతిక తరం.. మా తరం..

బాలికలను సాంకేతికంగా ఎదగనివ్వాలి. శాస్త్ర, సాంకేతిక రంగంలో వారికి సమానావకాశాలు ఇవ్వాలి. వారికీ డిజిటల్ వాస్తవాలు తెలియాలి. బాలికలకు భావప్రకటనా స్వేచ్ఛ ఇవ్వాలి. వారు ఆనందంగా ఉండే వాతావరణం కల్పించాలి. ఆడపిల్లలకు అపరిమిత సామర్థ్యానికి మార్గాలు సుగమం చేయడానికి అవసరమైన పరిష్కారాలు చూపాలి. అందరం కలిసి 'అంతర్జాతీయ బాలికా దినోత్సవం' 2021 థీమ్ కింద 'సాంకేతిక తరం.. మా తరం' అని అమ్మాయిలంతా సగర్వంగా చెప్పుకునేలా.. ఆ రంగంలో ఉన్నతంగా ఎదిగేలా తోడ్పడదాం.
ఎలా వచ్చింది ?

అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్‌వెల్ట్, 192 దేశాలు సంతకం చేసిన మానవహక్కుల ప్రకటనలో స్త్రీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా 'మ్యాన్' అన్న పదాన్ని 'పీపుల్'గా మార్చింది. మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలానార్ రూజ్‌వెల్ట్ పుట్టినరోజైన అక్టోబరు 11ను 'అంతర్జాతీయ బాలికా దినోత్సవం'గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది.
- తొలిసారిగా 2012, అక్టోబరు 11న ఈ దినోత్సవం జరిపారు. ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు (విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహం) పై, వివక్షపై అవగాహన పెంచడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.
- బాలికలు, యువతులు వారివారి రంగాల్లో ప్రచారం, పరిశోధనలకు సంబంధించి సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ దినోత్సవ వేడుకలు జరగాలి.
బాలికలను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. వారి హక్కులను పరిరక్షించాలి అంటూ గొప్పగా చెబుతూ ఉంటారు. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. వారు హక్కుల హరణకు గురికావడమే కాక.. కనీస గుర్తింపుకీ, గౌరవానికీ నోచుకోవడం లేదు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకే అక్టోబర్ 11న 'అంతర్జాతీయ బాలికా దినోత్సవం' మన కర్తవ్యాన్ని తెలియజేస్తోంది.
ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటుతారు

రాజస్థాన్‌లో పిప్లాంట్రి గ్రామం పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రపంచ మీడియా వేనోళ్ల పొగుడుతోంది. అందుక్కారణం... ఆడపిల్లను ఆదరిస్తున్న ఆ ఊరి జనమే. ఆడపిల్ల పుట్టగానే అక్కడివారు దురదృష్టం అనుకోరు. సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. వెంటనే మామిడి, నిమ్మ, ఉసిరి లాంటి రకరకాల చెట్లు 111 నాటుతారు. ఈ సంప్రదాయాన్ని పిప్లాంట్రి గ్రామ సర్పంచిగా ఉన్న శ్యామ్‌సుందర్ పలివాల్ తన కూతుర్ని కోల్పోయిన కొన్ని నెలలకు మొదలుపెట్టారు.
గ్రామస్తులందరినీ సమావేశపరిచి, ఆడపిల్ల పుడితే చెట్లు నాటి, వాటిని పెంచి పెద్ద చేద్దామన్న పలివాల్ ఆలోచనకు.. మొదట పెద్దగా స్పందన రాలేదు. కానీ, ఒకరిద్దరు ఈ సంప్రదాయాన్ని పాటించాక, అందరూ అనుసరించారు. కేవలం చెట్లు నాటేయడంతో ఈ కథ ముగియదు. వాటిని పెంచి, పెద్ద చేసే బాధ్యతా తీసుకుంటారు. అంతేకాదు.. ఆడపిల్ల పుట్టిన కుటుంబ యజమానికి రూ.10 వేలు పంచాయతీ ఇవ్వాలి. గ్రామస్తులంతా మరో రూ.21 వేలు చందా ఇస్తారు. మొత్తం 31 వేలను ఆ అమ్మాయి పేరున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. 20 ఏళ్ల తర్వాత, ఆ ఎఫ్‌డీ అమ్మాయి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అమ్మాయి అభ్యున్నతికి చేసిన ఏర్పాటిది. భవిష్యత్తుపై భరోసా ఉండటంతో ఆడపిల్లను కన్నామని ఎవరూ చింతించరిక్కడ. 18 ఏళ్ల కంటే ముందు అమ్మాయికి పెళ్లి చేయబోమని, ఆమె చదువును ఆపబోమని, తనకోసం నాటిన చెట్లను కాపాడతామని పంచాయతీకి తల్లిదండ్రులు అఫిడవిట్ కూడా సమర్పించాలి. దీన్ని మీరితే గ్రామంలో ఎవ్వరూ ఆ కుటుంబానికి సహకరించరు. ఆడపిల్ల పుట్టినప్పుడే కాదు, ఎవరైనా చనిపోయినప్పుడూ 11 చెట్లు నాటడం గ్రామంలో సంప్రదాయంగా మారింది. గ్రామంలో మద్యపానం, జంతు వధ, చెట్లు నరకడం నిషిద్ధం.. గత ఏడెనిమిదేళ్లలో ఇక్కడ ఒక్క పోలీస్ కేసు కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రభుత్వాల బాధ్యత

వివక్ష, అసమానత, చిన్నచూపు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హింస, ఆధిపత్యం తదితర అంశాలు బాలికలకు హాని చేస్తున్నాయి. ఈ ధోరణి సమాజాభివృద్ధికి, మహిళా సాధికారతకి అవరోధంగా నిలుస్తున్నాయి. అందుకే బాల్య వివాహాలను నిరోధించి, హింస నుంచి వారిని రక్షించడానికి కుటుంబం, మిత్రులు, సమాజం అంతా ఐక్యంగా సన్నద్ధం కావాలి. అమ్మాయిలపై జరిగే అకృత్యాలను అంతం చేయడానికి, ఆమెని శక్తివంతురాలిగా చేస్తూ సాధికారత వైపు పయనింపజేయాలి. ఈ బాధ్యత ఏ ఒక్కరిదో కాదు.. అందరిదీనూ. ఇందులో ప్రభుత్వం నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి. పౌర సంస్థలు, ప్రజలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఏకం కావాలి. కలిసికట్టుగా, ప్రణాళికా బద్ధంగా, నిబద్ధతతో కృషి చేయాలి.
బాలికా సంరక్షణే ధ్యేయం

జైరాంపుర గ్రామంలో సౌలాల్ గోలియా అనే సామాన్య రైతు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాలికలు జన్మించిన వెంటనే వారికి శుభాకాంక్షలు చెబుతూ ఉత్తరాలు పంపుతూ, పుట్టిన వివరాలు నమోదు చేస్తారు. ఈ గ్రామంలోనూ పంచాయతీ అధికారులు ఏటా బాలికా జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. పంచాయతీ సభ్యులు సైతం ఇంటింటికీ వెళ్లి బాలికా సంరక్షణ ఆవశ్యకతను వివరించటం వల్ల ఈ గ్రామంలో బాలుర కన్నా బాలికలే ఎక్కువగా జన్మించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలే అత్యధికంగా విద్యను అభ్యసిస్తున్నారు. లాల్‌పురాలో సైతం సర్పంచ్ ఓం ప్రకాశ్ బైర్వా తన గ్రామంలో బాలికలు కనీసం 12వ తరగతి వరకూ చదివించాలనే ఆయన ప్రయత్నం ఫలించి, మధ్యలో చదువు ఆపేసే బాలికల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ జిల్లాల్లో 1,460 మగబిడ్డలు జన్మిస్తే వీరికి ధీటుగా 1,620 మంది బాలికలు సైతం జన్మించారు. మగపిల్లలతో పాటు ఆడపిల్లల పుట్టుక ఇక్కడ సమాంతరంగా సాగుతోంది.
శాంతిశ్రీ
8333818985