అమరావతి: బాలికల హక్కులపై తల్లిదండ్రులకు అవగాహన కలిగి ఉండాలని పల్నాడు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ కల్ప శ్రీ కోరారు. శుక్రవారం గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులకు, బాలికలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ కలెక్టర పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ కో ఆర్డినేటర్ తండు లక్ష్మణ్ వహించారు. ఈ సందర్భంగా కల్పశ్రీ మాట్లాడుతూ ప్రతి ఆడపిల్ల ఎవరి మీదా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడానికి వారి తల్లి దండ్రులు సహకరించాలన్నారు. ఆడపిల్లలు బాగా చదువుకొని వాళ్ల కాళ్ళపై వాళ్ళు నిలబడితే కట్నం ఇవ్వాల్సిన అవసరం ఉండదని అన్నారు. తన తల్లిదండ్రులు తాను కలెక్టర్ కావడానికి పూర్తి సహకారం అందిందిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేసుకున్నారు. తాను మొదట సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే దానినని, తన తండ్రి కోరిక మేరకు ఆ జాబ్ మానేసి యూపీఎస్సీ చదివి కలెక్టర్ అయ్యానని అన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాదని, చదవాలనే ఆకాంక్ష ఉండాలని అన్నారు. పిల్లలకు ఇష్టమైన సబ్జెక్టులని తల్లిదండ్రులు చదివిం చాలన్నారు. అనంతరం పల్లోటి జూనియర్ కాలేజ్ డైరెక్టర్ ఫాదర్ భాస్కర్, డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బత్తుల విజయ , గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ డైరెక్టర్ సిస్టర్ విన్నారాసి మాట్లాడారు. కార్యక్రమంలో సిస్టర్ డియానా , అగస్టీన్ స్కూల్ సుపీరియర్ సిస్టర్ ప్రియా, సిస్టర్ గ్రేసి, సిస్టర్ మార్టినా, రిటైర్డ్ ఏ ఈ కూచిపూడి రవి శేఖర్ పాల్గొన్నారు.










