Sep 28,2023 22:18

బాలిక మృతిపై రాజకీయం తగదు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
బాలిక మృతిపై రాజకీయాలు చేయడం తగదని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యులు గజ్జల లక్ష్మి హితవు పలికారు. పెనుమూరు మండలం వేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ (17) అనుమానాస్పద మతిపై ఆమె గురువారం ఆరా తీశారు. ఈ ఘటన వెలుగుచూసిన రోజే బాధితురాలి తల్లిదండ్రులతో చిత్తూరు ఎస్పీ రిశాంత్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినా గజ్జల లక్ష్మీ తాజాగా మరోమారు స్పందించారు. పెనుమూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్‌ఐతో మాట్లాడి భవ్యశ్రీ మృతిపై వినిపిస్తున్న వదంతులపై నిజనిజాల్ని త్వరగా తేల్చాలని కోరారు. ఇప్పటికే అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్‌ఐ ఆమెకు చెప్పారు. భవ్యశ్రీ బాడీ పోస్టుమార్టంలో తీసిన అవశేషాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపించామని, రిపోర్ట్‌ రాగానే వాస్తవాలు తెలుస్తాయన్నారు. బాలికపై ఏదైనా అఘాయిత్యం జరిగిందని తేలితే.. దోషులు ఎంతటి వారైనా వారికి కఠినంగా శిక్షలు పడేలా దర్యాప్తు కొనసాగించాలని గజ్జల లక్ష్మీ కోరారు. అనంతరం భవ్యశ్రీ నివాసానికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. భవ్యశ్రీ కుటుంబ దీనస్థితిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దష్టికి తీసుకెళ్లి ప్రభుత్వసాయం అందేలా చూస్తామని మహిళా కమిషన్‌ తరఫున భరోసానిచ్చారు. మహిళా కమిషన్‌తో పాటు ప్రభుత్వం, న్యాయవ్యవస్థలు మహిళల పక్షాన నిరంతరం పనిచేస్తున్నాయని, ప్రతిపక్షాలు బాలికల విషయాల్లో దిగజారుడు రాజకీయాలు మానేస్తే ప్రజలు హర్షిస్తారని గజ్జల లక్ష్మి తెలిపారు.