బాల కార్మికులపై ఆరా తీస్తున్న రామచంద్రరావు
ప్రజాశక్తి-గొలుగొండ:బాల కార్మిక నిర్మూలన, వెట్టిచాకిరి నుంచి విముక్తికి గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు నర్సీపట్నం లేబర్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ బి.రామచంద్రరావు అన్నారు. బుధవారం కేడిపేట, చోద్యం, లింగంపేట తదితర గ్రామాల్లో పెట్రోల్ బంకులు, ఇటుక బట్టీలు, షాపులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వెట్టిచాకిరి నిర్మూలన దినం సందర్భంగా ఈ నెల 16వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగా లేబర్ సర్టిఫికేట్లు, లేబర్ ఇన్యూరెన్స్ ఇతర సౌకర్యాలపై తనిఖీలు చేపడతామన్నారు. కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్మికశాఖ అధికారి వర్మ పాల్గొన్నారు.










