Oct 31,2023 21:13

నేర సమీక్షలో మాట్లాడుతున్న ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌

           ప్రజాశక్తి-అనంతపురం క్రైం   బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు పోలీసు వ్యవస్థ తీవ్రంగా శ్రమించాలని ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ సూచించారు. మంగళవారం స్థానిక పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఎస్‌ఐ, ఆ పై స్థాయి అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించే దిశగా సంబంధిత శాఖతో కలిసి పని చేయాలన్నారు. 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలు విద్యాసంస్థల్లో ఉండేలా కృషి చేయాలన్నారు. అలాగే రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గ్రేవ్‌ కేసుల్లో తప్పనిసరిగా నిందితులకు శిక్షలు పడేలా చర్యలు ఉండాలని, కేసులు వీగిపోకుండా చూడాలని ఆదేశించారు. ఫ్యాక్షన్‌ ప్రభావిత, సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. మట్కా, పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌లకు తావులేకుండా చూడాలన్నారు. కిందిస్థాయి మట్కా బీటర్‌ నుంచి నిర్వాహకుల వరకూ ఎవరినీ వదలొద్దన్నారు. గంజాయి నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఆర్‌.విజయభాస్కర్‌రెడ్డి, జి.రామకృష్ణ (సెబ్‌), ఎ.హనుమంతు (ఏఆర్‌), డీఎస్పీలు ప్రసాదరెడ్డి, ఆంథోనప్ప, బి.శ్రీనివాసులు, శివారెడ్డి, సీఎం గంగయ్య, యు.నరసింగప్ప, డీపీఓ ఏఓ శంకర్‌, లీగల్‌ అడ్వైజర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.