
ప్రజాశక్తి -అనకాపల్లి : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గత నెల రోజులుగా జరిపిన దాడుల్లో 15 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. పట్టుబడిన యాజమాన్యాల చేత కనీస వేతనాల చట్టం ప్రకారం బాల కార్మికులకు నష్టపరిహారం ఇప్పించడం జరిగిందని చెప్పారు. పిల్లలను బడికి పంపాలని బాల కార్మికుల తల్లులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎస్సీపిసిఆర్ మెంబర్ టి.ఆదిలక్ష్మి, కార్మిక శాఖ అధికారులు నరేంద్ర, పి సూర్యనారాయణ, బి.రామచంద్రరావు, ఐసిడిఎస్ పిడి అనంతలక్ష్మి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.