
ఒక మంచి భవంతిని కట్టాలంటే తొలుత గట్టి పునాదిని నిర్మిస్తాం. పునాది పటిష్టతపైనే భవనం నాణ్యత ఆధారపడి ఉంటుంది. సమాజమనే భవనానికి బాల్యం గొప్ప పునాది. నేటి పిల్లలే రేపటి పెద్దలవుతారు. ఏఏ విలువల మీద, అనుభవాల మీద బాల్యం రూపొందుతుందో - ఆయా విలువల, అనుభవాల మీదనే 'రేపటి పౌర సమాజం' నిర్మితమవుతుంది. అందుకే బాల్యం ఒక అపురూప సందర్భం. విశాల విశ్వ విద్యాలయం. కానీ, ఆ బాల్యదశను మనం సరిగ్గా అర్థం చేసుకుంటున్నామా ? బాల్యాన్ని ఆస్వాదించే, అనుభవించే అవకాశం ఇప్పుడెంతమంది పిల్లలకు అందుబాట్లో ఉంది ?
అనేకానేక కారణాల చేత ఇప్పుడు బాల్యం బాల్యంలా లేదు. బతుకు వేగం పెరిగింది. ఆ వేగం ప్రభావం బాల్యం మీదా పడింది. నూతన ఆర్థిక విధానాలు అమల్లోకొచ్చిన తరువాత రేపటి జీవనం ఈ రోజే మన చేతుల్లోకి వచ్చేసింది. అంటే కచ్చితమైన సంపాదన అనే ఒక సాధనం చేతిలో ఉంటే చాలు; రాబోయే అనేక ఏళ్ల పాటు వచ్చే ఆదాయం ఆధారంగా నెలవారీ చెల్లింపుల ప్రతిపాదికన బైక్ కొనుక్కోవొచ్చు, కారు సమకూర్చుకోవొచ్చు, ఇల్లూ అమర్చుకోవొచ్చు. ఒకప్పుడు చేతిలో డబ్బు ఉంటేనే ఇలాంటివి సమకూరేవి. అప్పు చేసి పప్పుకూడు తినటం మన సమాజానికి అలవాటు లేదు. 'వ్యాపారం' వృద్ధి చెందే క్రమంలో అవన్నీ మారిపోయాయి. ఈరోజు అప్పు తెచ్చుకునే సామర్థ్యం ఉంటే చాలు, ముందు తరాల జీవనాన్నీ అనుభవంలోకి తెచ్చేసుకోవొచ్చు. ఇప్పుడు ఈ అలవాటు సమాజం చాలా మేర బలంగా పాకిపోయింది.
నిత్య సమరం..
ఈ క్రమంలో పెద్దలకు సంపాదన ఒక తప్పనిసరి అత్యావశ్యక విధిగా మారిపోయింది. ఎక్కడ ఒక రూపాయి పెట్టుబడి పెట్టినా- అది కచ్చితమైన లాభాలను ఇవ్వాలి. లేకుంటే అరువు బతుకు బరువుగా మారిపోతుంది. పక్కవాళ్ల కన్నా వెనబడిపోతామేమో అన్న భయం వెంటాడుతుంది. లేదంటే మునిగిపోతాం అన్న బెంగ గుండెల్లో తిష్ట వేస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు పెట్టే పెట్టుబడిలో పిల్లల చదువు ప్రథమ స్థానంలో ఉంది. మన ప్రభుత్వాలూ, పెట్టుబడి బాబులూ కలిసి ప్రభుత్వ పాఠశాలలు పనికిరానివి అన్న స్థాయికి దిగజార్చారు. తల్లిదండ్రుల ఆశలు సఫలం కావాలంటే- ప్రయివేటు విద్యే పరమ అవసరం అన్న భావం బలంగా నాటేశారు. ఈ కారణం చేత మన రేపటి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత అనివార్యంగా కార్పొరేటు విద్యాసంస్థలకు బదలాయించబడింది. పిల్లలపై పెట్టే పెట్టుబడి పరమార్థం.. మంచి మార్కులు, ర్యాంకులూ.. ఆపై లక్షల్లో జీతాలొచ్చే ఉద్యోగాలు! మరి పిల్లల మీద అంత పెద్ద బరువు పెట్టాక- ఇక బాల్యం అనే ఆటల పాటల మాటల మూటల దశ ఒకటి మిగిలి ఉండడం అసాధ్యం అయిపోతుంది. బాధ్యతల బరువుకు బాల్యం నడుము వొంగిపోయి- అది ఏ మూలనో పడిపోతుంది. అప్పుడప్పుడు బాల్యం గురించి గుర్తొచ్చి, దానిని పిల్లలకు అందించాలనే ప్రయత్నం జరిగినా - అదీ కోచింగులానే ఉంటుంది. ఇంత టైం ఆడుకోవాలి, ఇలా పాడాలి, ఇలా ఆడాలి.. ఇంకా ఇలా ఇలా.. అన్న మూస పద్ధతులు పిల్లలకు రోత పుట్టిస్తున్నాయి. ఇదంతా జరుగుబాటు, ఆర్థిక వెసులుబాటు ఉన్న కుటుంబాల్లోని బాలల సంగతి! దీనికి భిన్నంగా వేరే బాలభారతం ఉంది. వారికి బాల్యమే కాదు; జీవనమూ నిత్య సమరమే !
కోవిడ్ కాలపు కష్టాలు

మన విద్యావిధానం కారణంగా బాల్యం ఇలా చిక్కుకుపోయింది అనుకుంటే- రెండేళ్ల నుంచి కోవిడ్ పుండు మీద పుల్లలా మారింది. కోవిడ్ ఎందరికో ఎన్నో విధాల నష్టం కలిగించింది. అందులోనూ అందరికన్నా ఎక్కువ నష్టం కలిగింది పిల్లలకే! ఉన్న అరకొర ఆటలూ లేవు. పాటల్లేవు. పాఠాలూ, పాఠశాలలూ లేవు. అన్నిటికీ మించి స్నేహితులతో ముచ్చట్లు లేవు. కీలకమైన విద్యార్థి దశలో రెండేళ్ల వ్యవధి చాలా విలువైంది. తోటి పిల్లలతో కలిసి మెలిసి తిరగక, తరగతి గది వాతావరణం అందుబాట్లో లేక.. పిల్లలు చాలా కోల్పోయారని చెబుతున్నారు విద్యావేత్తలు. 'పిల్లలు నేర్చుకోవటం అనే ప్రక్రియ మార్కుల్లో, ర్యాంకుల్లో మాత్రమే ఉండదు. మనో వికాసంలో ఉంటుంది. ఉపాధ్యాయుల నుంచే కాదు, పరిసరాల నుంచి, స్నేహితుల నుంచీ చాలా చాలా నేర్చుకుంటారు. అదంతా కోవిడ్ కాలంలో అందుబాట్లో లేకుండా పోయింది.' అని చెబుతున్నారు పిల్లల వ్యక్తిత్వ వికాసనిపుణులు అమరనాథ్. 'కోవిడ్ నియంత్రణ అనంతరం స్కూలుకి వస్తున్న పిల్లలను గమనిస్తే చాలా మార్పు కనిపిస్తోంది. చాలామందిలో చురుకుదనం తగ్గిందేమో అనిపిస్తోంది. నేర్చుకోవడం అనే ప్రక్రియకు అంతరాయం కలగటం వల్ల సబ్జెక్టుపరంగానూ చాలా వెనకబడడం తెలుస్తోంది.' అని వివరించారు ఓ విద్యాసంస్థ నిర్వాహకురాలు ఇంద్రాణి.
కోవిడ్ వ్యాప్తి సమయంలో చాలా ప్రయివేటు, కార్పొరేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహించాయి. ఇవి కొంతమేర ఉపయోగపడినా- ఈ తరహా బోధన తరగతి గదికి ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదు. ఆన్‌లైన్ విద్యను అందిపుచ్చుకోవటంలోనూ పిల్లలు, వారి తల్లిదండ్రులూ చాలా అవస్థలు పడాల్సి వచ్చింది. స్మార్టుఫోన్లు లేక, ఉన్నవారికి నెట్‌వర్కు అందుబాట్లో ఉండక.. చాలా ఇబ్బందులు పడ్డారు. మన రాష్ట్రంలోనే సుమారు 18 లక్షల మంది పిల్లలు దాదాపు రెండేళ్ల పాటు ఎలాంటి బోధన పొందలేకపోయారు. మొబైళ్లు అందుబాట్లో ఉన్న అనేకమంది పిల్లలు ఈ కాలంలో ఆన్‌లైన్ గేములకు బాగా అలవాటు పడినట్టు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇలా ఏవిధంగా చూసినా కోవిడ్ పిల్లలకు అపార నష్టం కలిగించింది.
కాయకష్టంలో బాలలు

ఇక పౌర సమాజంలో నెలకొని ఉన్న అనేక అవకరాలు బాల్యాన్ని మరింత భ్రష్టు పట్టిస్తున్నాయి. విద్య, విజ్ఞానాది అంశాల్లో పువ్వుల్లా, ఆహ్లాదపు నవ్వుల్లా వికసించాల్సిన పిల్లలు పేదరికం చేత కాయకష్టంలో మునిగిపోతున్నారు. పలకా బలపం పట్టాల్సిన చేతులు పలుగూ పారా పట్టాల్సి వస్తోంది. మనదేశంలో ఇప్పుడు బాల కార్మికుల సంఖ్య కోటి పైనే! ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలు చదువుకు దూరంగా ఉంటే రేపటి సమాజం ఎలా ఉంటుంది? వారి జీవితంలో వెలుగులేం ప్రసరిస్తాయి? స్వాతంత్య్రం వచ్చి ఆరేడు తరాలు గడిచాక కూడా ఇదే పరిస్థితా? ప్రభుత్వాలే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. రెక్కాడితే కానీ, డొక్కాడని కుటుంబాల్లోనే పిల్లలకు చదువు అందివ్వని పరిస్థితి ఉంటుంది. మరి ఆ పిల్లలు పాఠశాల ముఖం చూడాలంటే- ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలి. పిల్లలకు ఉచిత విద్య, భోజనం, వసతి కల్పించాలి. ప్రసంగాల్లో, కాగితాల్లో ప్రభుత్వ ప్రణాళికలు ఘనంగానే వినిపిస్తాయి. కానీ, ఆచరణలో చాలా ప్రభుత్వ పాఠశాలలను మూత వేస్తున్న దుస్థితి. కోవిడ్ కాలంలో ముదిరిన ఆర్థిక సంక్షోభం ఇప్పుడు చాలా కుటుంబాలను దుర్భర స్థితిలోకి నెట్టి వేసింది. ఈ నేపథ్యంలో చదువు అందని పిల్లల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. బాల కార్మికులు ఎక్కువగా ఉన్న ఐదు దక్షిణాసియా దేశాల్లో పాకిస్తాన్, ఇండోనేషియా, థారులాండ్, ఫిలీప్పైన్స్‌తో పాటు మన దేశమూ ఉంది. ఇటుక బట్టీలు, తివాచీ, గాజు పరిశ్రమలు, ప్రమాదకరమైన మందుగుండు తయారీ, హోటళ్లలో బాలలు పనిచేస్తున్నారు. నియంత్రణకు చాలా చట్టాలున్నాయి. చాలా స్వచ్ఛంద సంస్థలూ పనిచేస్తున్నాయి. పూర్తి ఫలితాలు రావాలంటే ఇంకా గట్టి ప్రయత్నం జరగాలి. దాని అర్థం బాలలను బలవంతంగా పని మాన్పించటం ఒక్కటే కాదు; వారి కుటుంబాల్లో బడికి పంపించే చైతన్యాన్ని కలగించాలి. ఆర్థికపరమైన ఆసరా కలిగించాలి.
పిల్లల అక్రమ రవాణా

అనేక సమస్యలకు పేదరికం కారణం. అది సృష్టించే అత్యంత అమానుషం పిల్లల అక్రమ రవాణా. మనదేశంలో ఏటా 40 వేల మంది బాలికలు అదృశ్యమైపోవటం దిగ్భ్రాంతి కలిగించే విషాదం. అందులో దాదాపు 11 వేల మంది ఏమైపోయారో, ఎక్కడ ఉన్నారో జాడ కూడా తెలియటం లేదు. అమ్మాయిలను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించే ముఠాలు ఈ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నాయి. దీని నియంత్రణకు ప్రభుత్వాల నుంచి, కొన్ని సంస్థల నుంచి కృషి జరుగుతున్నా- అది సరిపోవటం లేదు. చదువుతో వికసించాల్సిన పిల్లలు వస్తువుల్లా వినియోగించబడడం ఎంతటి విషాదం ! ఇంటి మీద అలిగో, ఇతర కారణాల చేతనో ఇల్లు వదిలి వెళ్లిపోతున్న పిల్లల సంఖ్యా ఎక్కువే! ప్రతి సంవత్సరం సుమారు 44 వేల మంది పిల్లలు ఇల్లు వదిలిపెట్టి పోతున్నారు. అలాంటి పిల్లలే ఎలాంటి సంరక్షణా లేక అక్రమ ముఠాలకు టార్గెట్ అవుతున్నారు. ఈ పిల్లల్లో కొందరు బాల కార్మికులుగా మారితే- మరికొందరు స్వార్థపరుల చేతుల్లో పడి నేరవృత్తిలోకి అడుగిడుతున్నారు. ఇంకొందరు బిక్షమెత్తి బతుకుతున్నారు. మన దేశంలో బిక్షగాళ్లుగా ఉన్న పిల్లల సంఖ్య అక్షరాలా మూడు లక్షలు. ఎంత దారుణం ఇది? ఇంతింతమంది ఇలా సమాజపు అట్టడుగు పొరల్లోకి జారిపోతుంటే- అందమైన బాల్యం ఏముంటుంది? అద్భుతమైన రేపటి భారతం ఎలా సాధ్యమవుతుంది?
సాంస్క ృతిక కాలుష్యం
బాలల వ్యక్తిత్వ నిర్మాణంలో సాంస్క ృతిక రంగం పాత్ర ఎంతో కీలకం. కానీ, ఇప్పుడు వస్తున్న సినిమాలు, ఆటలు, పాటలూ అన్నీ వ్యక్తిత్వ హననానికి దారి తీసేలా ఉంటున్నాయి. ఆన్‌లైన్ ఆటలన్నీ విపరీత పోటీని, స్వార్థాన్ని, నేరప్రవృత్తిని పెంచేలా ఉంటున్నాయి. చాలా సినిమాల్లో లైంగిక, హింసాత్మక దృశ్యాలు సర్వసాధారణమయ్యాయి. టీవీ ఛానెళ్లలోనూ ఈ ధోరణి విపరీతంగా ఉంది. పిల్లల ప్రమేయం లేకుండానే అనేక అనవసర దృశ్యాలు వారి కంట పడుతున్నాయి. అవి తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అనేక నేరాలకు, ఘోరాలకు, విపరీత ధోరణులకు అవి ప్రత్యక్ష, పరోక్ష ప్రేరేపకాలు అవుతున్నాయి. ఒక బాలుడు లేదా బాలిక 16 ఏళ్ల ప్రాయానికి వచ్చేసరికి వెయ్యి నుంచి 10 వేల అవాంఛిత దృశ్యాలను టీవీ, సినిమా, మొబైల్ ఫోన్ల ద్వారా చూసి ఉంటారని ఒక అంచనా. పిల్లల మనసు తడి సిమెంటు అద్దిన గోడ లాంటిది. ఏ భావనైనా సులభంగా ముద్రించుకుపోతుంది.
ఇక బాలల మీద జరుగుతున్న ఘోరాలూ మనదేశంలో ఎక్కువే ! ఏదొక రూపంలో రోజుకు 400 నేరాలు పిల్లల మీద జరుగుతున్నాయి. 2019లో దేశవ్యాప్తంగా లక్షా 48 వేల 185 కేసులు నమోదయ్యాయి. ఇందులో బాలికలపైనే ఎక్కువ. లైంగిక దాడి, హత్య, అసభ్య ప్రవర్తన వంటివన్నీ ఈ ఘోరాల్లో ఉన్నాయి. పిల్లలే నిందితులుగా ఉన్న కేసులు కూడా చాలా రికార్డవుతున్నాయి. ఈ లెక్కలన్నీ ఏం చెబుతున్నాయి? మన సమాజం ఆరోగ్యకరంగా లేదని వెల్లడిస్తున్నాయి. స్వేచ్ఛగా హాయిగా సాగాల్సిన బాల్యంలో భద్రత కొరవడడం ఎంత బాధాకరం?
పెరిగిన ప్రతిభా కౌశలం !

మన చుట్టూ ఉన్నది బాలల అననుకూల వాతావరణమే కాదు; ఎంతో సానుకూల దృక్పథమూ ఉంది. రెండు, మూడు దశాబ్దాల ముందు కన్నా ఇప్పుడు పిల్లల మీద అమ్మానాన్నల బాధ్యత పెరిగింది. మంచి భవిష్యత్తును ఇవ్వాలన్న తపన పెరిగింది. కోరుకున్న రంగాల్లో రాణింపు చేయాలన్న తర్ఫీదు పెరిగింది. చిన్నప్పటి నుంచి వివిధ అంశాల ప్రతిభను ప్రదర్శించే పిల్లలు పెరిగారు. అందుకే ఇది స్మార్టు తరం అంటున్నారు. అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మన బాలలు అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. నృత్యం, గానం, ఇతర నైపుణ్యాల ప్రదర్శనకు చాలా వేదికలు పనిచేస్తున్నాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం.
అయితే, పిల్లలకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో, శాస్త్రీయ దృక్పథం పెంపులో తగినంత కృషి జరగటం లేదు. పాఠశాలల్లో జరిగే కృషి పరీక్షలకే పరిమితమవుతుంది. ఛానెళ్లలో, వివిధ సంస్థల, ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో విజ్ఞానాన్ని పెంచే, ప్రోత్సహించే వేదికలు చాలా ఏర్పడాలి. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం నుంచి మేలైన శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు జరగాలి. ఈ విషయంలో మనం ఇప్పటికీ వెనుకపట్టునే ఉన్నాం. పైగా ఈ మధ్యకాలంలో మూఢత్వాన్ని పెంచే, మన గతమంతా ఘనం అనుకునే డప్పాల సంస్కృతి పెరుగుతోంది. గతం సరే ... ఇప్పటి సంగతి ఏమిటి? సాఫ్ట్‌వేర్ రంగాన్ని పక్కన పెడితే- ఇతరత్రా శాస్త్ర పరిశోధనల్లో మన స్థానం ఎక్కడీ దానిని భర్తీ చేయాల్సిన బాధ్యత మన రేపటి పౌరులదే కదా? మరి ఎక్కడ జరుగుతోంది, ఆ ప్రయత్నం?
ప్రపంచంలోని అనేక దేశాలు పిల్లలే కేంద్రంగా సమాజ నిర్మాణం చేస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్కు, ఫిన్లాండు, గ్రీస్, నార్వే, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో పిల్లల కోసం ఇంటా బయటా తగిన సదుపాయాలు ఉంటాయి. మనది ఇప్పటికీ పురుష కేంద్ర సమాజంగానే ఉంది. పురుషులే బయట తిరుగుతారని, వారికి తగినట్టుగానే ఏర్పాట్లు అమరి ఉంటాయి. మహిళల అవసరాలకు తగినట్టు టాయిలెట్లు కూడా ఉండవు. ఇక పిల్లలు పరిగణనలోనే ఉండరు. పైన పేర్కొన్న దేశాల్లో అలా కాదు. బాలలు తమకు తామే గుర్తింపబడడం ఒక హక్కుగా భావించి, గౌరవిస్తారు. ఆ హక్కులను కాపాడడం ప్రభుత్వ, సమాజ బాధ్యత. పిల్లల ఎత్తుకు తగిన కుర్చీలు, టాయిలెట్లు, రోడ్డు పక్క ప్రత్యేక మార్గాలు, పిల్లల హక్కులను గౌరవించి, విద్యను అందించే పాఠశాలలు ఆ సమాజాల్లో సర్వసాధారణం. ఫిన్లాండు, నెదర్లాండ్సు, కెనడా వంటి దేశాల్లో పిల్లలకు ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాయి. పిల్లలు అమ్మానాన్నల సంరక్షణలో ఉన్నప్పటికీ - వారి చదువు, ఎదుగుదలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే! కథలు రాయడం, చెప్పడం, బొమ్మలు గీయడం, ప్రయోగాలు చేయడం వంటి సృజనాత్మక అంశాల్లో అక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
ఎలా ఉండాలి మనం ?

మన రేపటి పౌరులు ఎలా ఉండాలో, ఎలా ఎదగాలో, వారికి ఏఏ హక్కులు అవసరమో మనదేశంలో ఇంకా ఒక స్పష్టతకు రావాల్సి ఉంది. చాలా చట్టాల వలె పిల్లల చట్టాలు మనకు ఉన్నాయి. కానీ, విద్యా హక్కుతో సహా ఏవీ సక్రమంగా అమలు కావు. 'పిల్లలు పిల్లలే! వాళ్లు పుట్టుకతోనే స్వతంత్రులు. తల్లిదండ్రులు కేవలం సంరక్షకులు మాత్రమే! వారిని తీర్చిదిద్దే బాధ్యత పేరిట ఏ హక్కులూ ఎవరికీ ఉండవు' అన్న ఖలీల్ జిబ్రాన్ మాటలు వినటానికే మనలో చాలామందికి మనసొప్పదు. మరి ఆచరణలోకి ఎప్పుడు తీసుకురాగలం ?
పిల్లలు ఈ ప్రపంచంలో అత్యంత అపురూపాలు. పుట్టుకతో స్వార్థం, అసూయ, తన పర బేధం, కులమూ మతమూ ప్రాంతమూ భాషా వ్యత్యాసాలు ఎరగని స్వచ్ఛమైన నవ్వులు. వారు ఎదుగుతున్న క్రమంలో అప్పటికే ఎదిగిన సమాజం కలుషితం చేస్తోంది. అనేకానేక రూపాల్లో వివక్ష చూపించి, ఒత్తిళ్లతో, పెత్తనాలతో హింసించి తన వికృత నమూనాను తనే విస్తరించుకుంటూ పోతోంది. ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఒకప్పుడు దానికి ఫుల్‌స్టాప్ పడాలి. అది జరగటానికి బాలల స్వేచ్ఛ మీద ఆపేక్ష ఉన్న స్వచ్ఛమైన వ్యక్తులూ సంస్థలూ పూనుకోవాలి. అలాంటి మంచి కృషితో మనమంతా హర్షించే ఆటల పాటల మాటల మూటల బాల్యం మన చుట్టూ వెల్లి విరియాలని మనసారా కోరుకుందాం !
ఆకలి భారతం !

మన పాలకులు సాధిస్తున్న ప్రగతి గురించి ఘనంగా చెబుతారు. చరిత్రా సంస్క ృతీ గురించి గొప్పగా వల్లిస్తారు. అదే సమయంలో దేశంలోని వాస్తవ పరిస్థితి గణాంకాలతో ఎదురొచ్చి వెక్కిరిస్తోంది. తాజాగా వెలువడ్డ ప్రపంచ ఆకలి సూచిలో మన దేశం 101వ స్థానంలో ఉంది. 116 దేశాల గణాంకాలను మధిస్తే- మనం ప్రజలకు ఆహారాన్ని సమకూర్చటంలో ఆఖరి వరుసలో పేద దేశాల సరసన నిలబడి ఉన్నాం. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ (76), నేపాల్ (76), పాకిస్తాన్ (92) మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. కోవిడ్, ఆర్థిక సంక్షోభం తదితర కారణాల వల్ల గతేడాది కన్నా మన దేశంలోని పరిస్థితి దిగజారింది. గత సంవత్సరం 94వ స్థానంలో ఉంటే ఇప్పుడు 101కి పడిపోవడం దీనికి నిదర్శనం. ఒకపక్క ఆహార ధాన్యాలు గోదాముల్లో మూలుగుతున్నాయి. మరోపక్క ఆకలి కేకలూ వినిపిస్తున్నాయి. రెంటినీ సమన్వయం చేసి, సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించటం లేదు. తగినంత ఆహారం అందివ్వకపోతే- ఆ ప్రభావం పిల్లల మీద తీవ్రంగా ఉంటుంది. పోషకాహారం అందక లక్షలాది మంది పిల్లలు వయసుకు తగిన ఎత్తు ఎదగటం లేదు. ఈ సమస్య గతంలో 17.1 శాతం ఉండగా, ఇప్పుడు 17.3 శాతానికి పెరిగింది. మనదేశంలో ప్రతిరోజూ 20 కోట్ల మంది ఆకలితో నిద్రపోతున్నారు. పిల్లలూ పెద్దలూ కలిపి సుమారు 30 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 'తిండి కలిగితే కండకలదోరు.. కండ కలవాడే మనిషోరు' అన్నాడు గురజాడ. మరి తిండే సరిగ్గా అందని పరిస్థితి బలమైన సమాజం ఎలా ఏర్పడుతుంది ?
చదువు ప్రాయంలో చావులా ?

విద్య అనేది సహజంగా, సరళంగా, సంపూర్ణ వికాసం మధ్య అందాల్సిన వెలుగు. అది దేశంలో కోట్లాదిమంది పిల్లలకు అందకపోవడం ఒక తీవ్ర సమస్య కాగా, అందుతున్న పిల్లలకూ ఒత్తిడిగా మారుతోంది. తల్లిదండ్రుల చేత, తోటి సమాజం చేత జీవిత లక్ష్యాలు ముందే నిర్దేశం కావటం వల్ల - వాటి సాధించే దిశగా బాలలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇది రకరకాల విష పరిణామాలకు దారి తీస్తోంది. ఆడుతూ పాడుతూ సాగాల్సిన ప్రాయంలో బలవన్మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మనదేశంలో 18 ఏళ్ల లోపు వారు రోజుకు 31 మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు జాతీయ నేర విచారణ విభాగం గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం ఇలా బలవన్మరణాలకు పాల్పడిన బాలల సంఖ్య 11,396. ఇందులో బాలురు 5,392 మంది కాగా, బాలికలు 6,004 మంది. రికార్డులకెక్కని మరణాలు ఇంకా ఉండొచ్చు.
చదువు విజ్ఞానాన్ని. వికాసాన్ని ఇవ్వాలి. భవిష్యత్తుకు బలమైన నమ్మకాన్ని, ఆశావహ దృక్పథాన్ని ఇవ్వాలి. కానీ, చాలామంది పిల్లల విషయంలో అది జరగటం లేదు. అందుకనే కుటుంబ సమస్యలు, చదువు ఒత్తిళ్లు, ఆకర్షణ, అనారోగ్యం, సినిమా నటుల ఆరాధన వంటివి పిల్లలను ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేస్తున్నాయి. 'మన సమాజం విద్య, ఆరోగ్యం సంబంధ అంశాలపై పెట్టినంత శ్రద్ధ.. మానసిక ఆరోగంపై పెట్టటం లేదు. బలవన్మరణాలకు వ్యవస్థ వైఫల్యమే కారణం. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలతో మాట్లాడాలి. ప్రతి సందర్భంలోనూ మేం మీకు అండగా ఉన్నామనే నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించాలి.' అంటున్నారు సేవ్ ది చిల్డ్రన్ సంస్థ డిప్యూటీ డైరెక్టరు ప్రభాత్‌కుమార్. ఓ మూడు దశాబ్దాల క్రితం తల్లిదండ్రులు తమ పిల్లలతో వారానికి 36 గంటలు గడిపితే- ఇప్పుడా వ్యవధి సగటున వారానికి 18 నిమిషాలకు తగ్గిపోయిందని ఒక అధ్యయనం చెబుతోంది. ఎంత దారుణం ఇది? పెద్దల ప్రేమ, పర్యవేక్షణ, స్నేహభావం కొరవడిన బాల్యం విపత్తులకు, విపరీతాలకు దారితీస్తుంది.
సుజయ సాహితి