ప్రజాశక్తి - శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన ఎన్‌ఎసిఎల్ సౌజన్యంతో బాక్సింగ్ రింగ్ పోటీలు నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో సోమవారం ప్రారంభమయ్యాయి. పోటీలను కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల క్రీడల్లో పతకాలు సాధించిన వారు జిల్లాలో ఎందరో ఉన్నారని చెప్పారు. సరైన మౌలిక వసతులు లేక బాక్సింగ్ పోటీల్లో జిల్లా రెండో స్థానంలో నిలుస్తోందని, మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. క్రీడా నిధులు, జిల్లా నిధులు, సిఎస్‌ఆర్ ఫండ్స్‌ను వినియోగించి క్రీడల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామన్నారు. బాక్సింగ్ క్రీడాకారులు ద్వితీయ స్థానం నుంచి ప్రథమ స్థానానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. కృషి, పట్టుదల, సాధన, తపన ఉంటే క్రీడాకారులకు సాధ్యం కానిది ఉండదన్నారు. తొలుత స్టేడియంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో జిల్లా చీఫ్ కోచ్ శ్రీధర్, ఎన్‌ఎసిఎల్ వైస్ ప్రెసిడెంట్ కె.శేషగిరిరావు, డిజిఎం పి.ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ, సెట్‌శ్రీ సిఇఒ బి.వి ప్రసాదరావు, నెహ్రూ యువ కేంద్రం జిల్లా సమన్వయకర్త కె.వి ఉజ్వల్, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, బాక్సింగ్ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










