Oct 21,2023 22:21

ప్రజాశక్తి - నిడదవోలు నిడదవోలు డిపోకు చెందిన బస్సు దగ్ధానికి కారకులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు జువ్వల రాంబాబు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు డిపో మేనేజర్‌ పూర్తి బాధ్యత వహించాలంటూ స్థానిక డిపో వద్ద శనివారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం డిపో తనిఖీకి వచ్చిన ఆర్‌టిసి డిపిటిఒ షర్మిలా అశోక్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యారేజ్‌ నుంచి బస్సులు బయటకు వచ్చేటప్పుడు డిఎం పర్య వేక్షణ లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలపై నిర్లక్ష్యం, కాలం చెల్లిన, ఫిట్నెస్‌ లేని బస్సులు నడపడమే ఈ సంఘటనకు కారణమని, ప్రజల భద్రత సౌకర్యాల పట్ల డిపో మేనేజర్‌ నిర్లక్ష్య ధోరణికి ఇది అద్దంపడుతోందని విమర్శంచారు. నాసిరకం బస్సులు ఇచ్చి మైలేజీ కోసం డ్రైవర్‌, కండక్టర్లపై ఒత్తిడి చేస్తున్నారని, వారు ఎంత కష్టపడిని ఫలితం ఉండటం లేదన్నారు. సిబ్బంది కొరతతో రోజూ రెండు మూడు సర్వీసులు రద్దు చేస్తున్నారని, విజయవాడ సర్వీసులను కూడా రద్దు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆర్‌టిసి అధికారులు నిడదవోలు డిపోను మూసివేసి, ఆ స్థలాన్ని వాణిజ్య సముదాయానికి అప్ప జెప్పేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో. గారపాటి ప్రసన్న కృష్ణ, గుమ్మాపు డేనియల్‌, తూరుగోపు నాని, ఉన్నమట్ల వెంకటేష్‌, మధు, తదితరులు పాల్గొన్నారు.