Oct 25,2023 21:57

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

ప్రజాశక్తి పుట్టపర్తి రూరల్‌ : పోలీస్‌ శాఖలో నిర్లక్ష్యం వీడి బాధ్యతగా పని చేసి కేసులలో పురోగతి సాధించాలని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. మట్కా గ్యాంబ్లింగ్‌ అక్రమ మద్యమంపై ఉక్కు పాదం మోపాలని ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పోలీస్‌ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో ఎస్పీ మాధవ్‌ రెడ్డి ఆధ్వర్యంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో పలు కేసులలో దోషులకు శిక్ష పడటం శుభ పరిణామం అని అన్నారు. దీనిద్వారా పోలీసుల పై ప్రజలలో నమ్మకం పెరుగుతుందని చెప్పారు. నేరాల్లో పాలు పంచుకున్న వారు ఎవరైనా ఎంతటి వారైన సరే చట్టం ద్వారా వారికి శిక్ష పడేలా దర్యాప్తు చేయాలని కేసులు కోర్టుల్లో విగిపోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిబ్బంది అందరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, బందోబస్తు వేసినప్పుడు సిబ్బంది ఉన్నారా లేదా అన్న విషయాలను పోలీసు అధికారులు గమనించాలని అన్నారు. ప్రధానంగా పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వీలైనంత వరకు వాటిని తగ్గించాలని సూచించారు. అలాగే జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీస్‌ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలలో పోలీసుల పట్ల విశ్వాసం పెంపొందేలా మెలగాలన్నారు. పోలీస్‌ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం కలిగేలా వ్యవహరించాలన్నారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా కొనసాగించాలన్నారు. అనుమానాస్పదంగా మృతిచెందిన చెందిన కేసులలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. నాలుగు రోడ్ల కూడలిలో పబ్లిక్‌ మీటింగులు నిర్వహించినప్పుడు విఐపిలు వెళ్లే విధంగా ఒక రోడ్డును పూర్తిగా పోలీసుల అధీనంలో పెట్టుకోవాలని చెప్పారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులలో దర్యాప్తు కేసు ఫైల్‌ నిర్వహణ సాక్షులు విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జిల్లా పోలీస్‌ శాఖ అందరూ సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ విష్ణు, జిల్లా పరిధిలోని ఎస్‌డిపిఒలు తదితరులు పాల్గొన్నారు.