Jul 21,2023 23:42

పల్నాడు జిల్లా: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా వైసిపి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుందని బాధితులపై కేసులు నమోదు చేసి పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని టిడిపి నేతలు ఆరోపించారు. ఇటీవల నరసరావుపేట టిడిపి వైసిపి వర్గీయుల ఘర్షణలో గాయపడ్డ టిడిపి కార్యకర్తలను శుక్రవారం పరామర్శించారు. అనంతరం గుంటూరు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేతలు మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నరసరావుపేట నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మాట్లాడారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పల్నాడులో బీసీల పై జరుగుతున్న దాడుల గురించి బిసి మంత్రి విడదల రజిని మాట్లాడలేదని, అన్ని వ్యవస్థలను సీఎం చేతిలో పెట్టుకుని ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ వర్గీయుల పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. అనంతరం అరవిందబాబు, పుల్లారావు, వెంకన్న మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు వేల్పుల సింహాద్రి యాదవ్‌, మానుకొండ శివప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.