ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులలో బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టరు పి రంజిత్ బాషా ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం నిఘా, పర్యవేక్షణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో జరిగింది. బాధిత కుటుంబాలకు సకాలంలో పరిహారం అందించాలని జిల్లా కలెక్టరు తెలిపారు. చట్టపరంగా పరిహారం చెల్లింపులలో జాప్యం ఉండరాదని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. బాపట్ల జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం కింద 100 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల విచారణ సత్వరమే చేపట్టాలన్నారు. సాక్షులు, సాక్ష్యాధారాల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. బాధితులకు న్యాయం జరగడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, కల్పించిన హక్కులను పరిరక్షించాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాలు బాధితులకు అండగా ఉంటాయనే భరోసా కల్పించాలన్నారు. 2011 నుంచి బాపట్ల జిల్లా పరిధిలోని మండలాలలో 73 కేసులు పెండింగ్‌లో ఉండడంపై ఆరా తీశారు. డివిజన్ల వారీగా ఆర్డీవోలు, డీఎస్పీలతో క్షుణ్ణంగా సమీక్షించారు. వాటి పూర్వపరాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. చార్జిషీటు దాఖలు చేయడంలో నిబంధనలు పాటించాలన్నారు. కేసులలో పురోగతి సాధించడానికి డివిజన్ స్థాయిలో ఆర్‌డిఓలు ప్రతి నెల ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని కలెక్టరు ఆదేశించారు. బాధితులకు పరిహారం అందడంలోనూ కులధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో నిబంధనలు అనుసరించాలన్నారు. అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో రాజీపడే వాటిపై అధికారులు నిశిత పరిశీలన చేయాలని కలెక్టరు పి రంజిత్ బాషా తెలిపారు. బాధితులను ప్రలోభపెట్టే అవకాశం ఉన్నందున రాజీ కేసులను పున్ణపరిశీలించాలన్నారు. ప్రతి నెలలో ఒకరోజు అన్ని మండలాలలో పౌరహక్కుల దినోత్సవం విధిగా నిర్వహించాలన్నారు. బాపట్ల జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేటికి ఆధార్ కార్డులు లేని ఎస్‌సి, ఎస్‌టిల కోసం మొబైల్ ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. బాపట్ల మండలంలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తదుపరి సమావేశానికి సమగ్ర వివరాలతో అధికారులు హాజరు కావాలని పలు సూచనలు చేశారు. కమిటీ సభ్యులు పలు సమస్యలను కలెక్టరు దృష్టికి తెచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్‌పి వకుల్ జిందాల్, డిఆర్‌ఓ కె లక్ష్మీశివజ్యోతి, ఆర్‌డిఓలు, జి రవీంద్ర, పార్థసారథి, పి సరోజిని, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి జె రాజదెబోరా, డిఎస్‌పిలు, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










