ప్రజాశక్తి -అరకులోయ రూరల్:గాలివాన బీభత్సానికి చెట్లు కూలిపోయి మూడు ఇల్లు ద్వంసం అయిన బాధితులకు పరిహారం చెల్లించాలని ఏపీ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని కొత్తబల్లుగుడ పంచాయతీ సరనాయిగుడ గ్రామంలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత,ూ ఆదివాసీ నిరుపేద పిటిజీ గిరిజనులు కష్టబడి కట్టుకున్న రేకుల ఇల్లులు ఈదురుగాలులకు వృక్షం పడి ధ్వంసం అయ్యాయన్నారు. ఇద్దరు మహిళలు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయట పడ్డారన్నారు. ఇంట్లో ఉన్న రెండు 20 బస్తాలు ధాన్యం, నాలుగు బస్తాల చోళ్లు, టీవీ, బీరువా పూర్తిగా ధ్వంసం అయ్యాయని తెలిపారు.అధికారులు స్పందించి నష్ట పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదు రోజులు గడిచిన అధికారులు చెట్లు తొలగించకపోవడం దారుణమన్నారు.గిరిజనులు చెట్టు తొలగించాలంటే కట్టర్స్ ఉండాలని, అంత స్థోమత వారికి లేదన్నారు. ఇంటి పై పడి ఉన్న వృక్షం వెంటనే తొలగించాడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కొర్ర మగ్గన్న పాల్గొన్నారు.










