ప్రజాశక్తి -నర్సీపట్నంటౌన్ :మున్సిపాలిటీ సాధారణ సమావేశం అధికార, విపక్షాల వాగ్వావాదాలతో దద్దరి ల్లింది. చైర్పర్సన్ ఆదిలక్ష్మి అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు. ముందుగా అభీద్ సెంటర్ నుండి పెద్ద బొడ్డేపల్లి పెద్దమధం వరకు రోడ్డు విస్తరణ తీర్మానంపై అజెండా వివరించారు. దీనికి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి, కౌన్సిలర్ పద్మావతి మాట్లాడుతూ, రోడ్డు విస్తరణను తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుందని, ఇందుకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. రోడ్డు విస్తరణతో నష్టపోతున్న వ్యాపారులు, షాపు యజమానులకు నష్టపరిహారంను నగదు రూపంలో చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. దీనికి వైసిపి కౌన్సిలర్ తమరాన నాయుడు, శెట్టి చినబాబు ఆమె మాటకు అడ్డు తగులుతూ అమరావతి లో మీరు ఏ విధంగా అమలు చేశారో ఇక్కడ కూడా తమ ప్రభుత్వంలోని అదే విధానం అమలు చేస్తుందన్నారు. అమరావతి రైతులకు ఇచ్చే విధంగానే ఇక్కడ నష్టపోయిన వారికి ఇస్తున్నామని తెలిపారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. 2019-20లో ఇచ్చిన జీవో ప్రకారం విస్తరణ పనులు చేపడుతున్నామని కమిషనర్ పేర్కొన్నారు. దీనికి చైర్పర్సన్ మాట్లాడుతూ, రోడ్ విస్తరణ పనులపై మున్సిపాలిటీ చైర్పర్సన్ అయిన తనకు ఇప్పటివరకు అధికారులు ఏమీ తెలియజేయలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ రోడ్డు విస్తరణ పై తనకు ఎటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అధికారులు ఏమీ చెప్పకుండా నీళ్లు నమిలారు. చైర్ పర్సన్ అధికారులను నిలదీస్తున్నప్పటికీ అధికార వైసిపి కౌన్సిలర్లు ఎవరూ ఆమె తరపున మాట్లాడక పోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. చైర్ పర్సన్ పై అదే పార్టీ కౌన్సిలర్లు వివక్ష చూపుతున్నారనే విషయం తేటతెల్లమయింది.
రోడ్డు విస్తరణ పనులను చైర్పర్సన్‌కు తెలియజేయక పోవడంపై సభ అనంతరం విలేకరులు కమిషనర్ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కౌన్సిలర్లకు అందరికీ ఈ విషయాన్ని తెలియజేశామని, రోడ్డు విస్తరణ పై చైర్పర్సన్‌కు తెలుసని, జనవరి 31న దీనిపై తీర్మానం కూడా చేయడం జరిగిందని ఆయన అన్నారు. సభం అనంతరం రోడ్డు విస్తరణకు నగదు రూపంలో నష్టపరిహారం చెల్లించాలని చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్‌కు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు వినతి పత్రాన్ని అందించారు.
వినూత్న రీతిలో రామరాజు హాజరు
స్థానిక మున్సిపల్ సాధారణ సమావేశానికి 20వ వార్డు కౌన్సిలర్ రామరాజు తమ వార్డుకు కావలసిన డిమాండ్స్‌ను నెరవేర్చాలంటూ బ్యానర్ పట్టుకొని వినూత్న రీతిలో హాజరయ్యారు. దీనికి చైర్పర్సన్ ఆదిలక్ష్మి అసహనం వ్యక్తం చేస్తూ సభ సజావుగా జరగాలని, ఇటువంటివి సరైనవి కావన్నారు. సమస్యలను కౌన్సిలర్ సమావేశంలో తెలియజేస్తే మంచిదని ఆమె సూచించారు. దీంతో ఆయన మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా తమ వార్డుకు మంచినీటి, వీధి దీపాల సమస్య అధికంగా ఉందని, రోడ్డు సదుపాయం కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. లింగాపురం, కళ్లెంపూడి, సీతయ్య పాలెం గ్రామస్తుల తరఫున తాను డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వం బోయ, వాల్మీకి లను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్న తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వార్డుకువస్తే సమాధానం చెబుతాం
మున్సిపల్ సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు దనిమిరెడ్డి మధు, శ్రీకాంత్, చింతకాయల పద్మావతి, పెదిరెడ్ల దివ్య, రాజు నాయుడు విలేకరులతో మాట్లాడుతూ, మున్సిపల్ కమిషనర్‌కు పారిశుధ్యం పై ఎన్నిసార్లు విన్నవించుకున్నా కనీసం స్పందించడం లేదని తెలిపారు. అన్ని వార్డులను సమానంగా చూడాలని, తమ వార్డులపై వివక్ష చూపుతున్నారని, నర్సీపట్నంలో పారిశుధ్య నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కమిషనర్‌కు తమ వార్డు ప్రజలపై కనీసం కనికరం లేదన్నారు.
బాధితులకు అండగా ఉంటాం
రోడ్డు విస్తరణలో బాధితులకు అండగా ఉంటామని జనసేన పార్టీ కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య విలేకరులకు తెలిపరు. రోడ్డు విస్తరణలో బాధితులకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో నష్టపరిహారం నగదు రూపంలో చెల్లించాలన్నారు. మున్సిపాలిటీలో ప్రజల సొమ్ము అక్రమార్జనకు గురవుతుందని, తప్పుడు లెక్కలు చూపిస్తూ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఉత్తర వాహిని తీరంలో ఇటీవల శివరాత్రి కార్యక్రమాన్ని నిర్వహించి లక్షల రూపాయలు దోచేసారని విమర్శించారు.










