బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం
ప్రజాశక్తి - పాములపాడు
పాములపాడు మండలం భానుముక్కల గ్రామంలో శనివారం సాయంత్రం కురిసిన గాలివానకు భారీ వృక్షం కూలి రెండు మిద్దెలపై పడి నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం భానుముక్కల గ్రామంలో దెబ్బతిన్న ఇళ్లను సిపిఎం మండల కార్యదర్శి సామన్న, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి సుధాకర్, నాయకులు మధులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడ్డం దేవ సహాయం, గడ్డం బాలమ్మ ఇల్లు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. దేవ సహాయం పైకప్పు లేచిపోయిందని, బాలమ్మ ఇల్లు, బాత్రూం బాగా దెబ్బతిన్నాయని తెలిపారు. బాధితులకు నష్టపరిహారం రూ. 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.










