Oct 08,2021 06:17

ప్రశాంతంగా తమ కార్యక్రమాన్ని ముగించుకుని వెనక్కు పోతున్న రైతుల మరణాలకు కారకుడైనవాడు నేరస్తుడౌతాడు. మరణించిన రైతులు, గాయపడినవారు బాధితులౌతారు. నేరస్తుల మీద కేసులు పెట్టాలి. బాధితులను ఆదుకోవాలి. ఇది రాజధర్మం. ప్రజాస్వామ్యంలో సైతం ఇదే పాలకుల ధర్మం. కాని యోగి పాలనలో అంతా తలకిందులుగానే జరుగుతున్నది. ఇక్కడ బాధితులే నేరస్తులౌతున్నారు.

    బాహుబలి-1 సినిమాలో ఒక సన్నివేశం ఉంది. దుర్మార్గుడు, ప్రజా కంటకుడు అయిన రాజు విగ్రహాన్ని నిలబెట్టే పనిలో వందల సంఖ్యలో మనుషులు ఉంటారు. మోకులతో ఆ భారీ విగ్రహాన్ని వాళ్ళంతా లాగుతూంటారు. అలా లాగుతున్నవాళ్ళనే అక్కడున్న కొందరు సైనికులు కొరడాలతో చావమోదుతూ వుంటారు.
    ఉత్తర ప్రదేశ్‌ లో బిజెపి ప్రభుత్వం తీరు చూస్తుంటే ఆ సీన్‌ గుర్తుకొస్తోంది. ఎవరైతే తన విగ్రహాన్ని ప్రతిష్టించడానికి నానా అవస్థలూ పడుతున్నారో వాళ్ళకి తోడ్పడడం ఆ రాజు చేయాల్సిన పని. దానికి బదులు వాళ్ళనే నేరస్తుల్ని చేసి చావమోదడం నిరంకుశత్వం మాత్రమే కాదు, అలవిమీరిన మూర్ఖత్వం కూడా. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఈ తరహా లక్షణాలనే కనపరుస్తోంది.
   గత మూడు వందల రోజులకు పైగా రైతులు మోడీ ప్రభుత్వం తెచ్చిన దుర్మార్గమైన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆ చట్టాలను రద్దు చేస్తేనేకాని వెనక్కు పోయేది లేదని తెగేసి చెప్తున్నారు. వందల సంఖ్యలో ఆ ఉద్యమకారుల్లో ఇప్పటికి తమ ప్రాణాలను సైతం అర్పించి అమరులయ్యారు. ఆ ఉద్యమంలో భాగంగానే రైతులు లఖింపూర్‌ ఖేరి లో ఒక కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి మౌర్య కు తమ నిరసనను తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న మేరకు కార్యక్రమం జరిగింది. చాలా శాంతియుతంగా, నల్ల జెండాలతో నిరసనలు తెలిపి తర్వాత వెనక్కు పోతున్న ఆ రైతుల మీదకు వాహనాలను తోలి, కాల్పులు కూడా జరిపి నలుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్‌ మిశ్రా టెని. తన కుమారుడు ఆ ఘటనా స్థలంలో లేనే లేడని, ఆ సమయానికి తనతోనే ఉన్నాడని కేంద్ర మంత్రి అజరు మిశ్రా దబాయించి తప్పించుకోడానికి చూశాడు. కాని నిన్న (5.10.21) విడుదలైన వీడియో ఫుటేజిలు కేంద్ర మంత్రి చెప్పినది పూర్తి అసత్యమని రుజువు చేశాయి.
    ప్రశాంతంగా తమ కార్యక్రమాన్ని ముగించుకుని వెనక్కు పోతున్న రైతుల మరణాలకు కారకుడైనవాడు నేరస్తుడౌతాడు. మరణించిన రైతులు, గాయపడినవారు బాధితులౌతారు. నేరస్తుల మీద కేసులు పెట్టాలి. బాధితులను ఆదుకోవాలి. ఇది రాజధర్మం. ప్రజాస్వామ్యంలో సైతం ఇదే పాలకుల ధర్మం. కాని యోగి పాలనలో అంతా తలకిందులుగానే జరుగుతుంది. ఇక్కడ బాధితులే నేరస్తులౌతున్నారు.
    అబద్ధాలు చెప్పి తన కుమారుడి నేరాన్ని కప్పిపుచ్చడానికి కేంద్ర మంత్రి, ప్రయత్నించిన వైనం రుజువైంది. అయినా ఇప్పటికీ అతగాడు కేంద్ర మంత్రిగానే కొనసాగుతున్నాడు. కారుతో తొక్కించి చంపిన ఆయన తనయుడూ ఇంతవరకూ అరెస్టు కాలేదు. తుపాకీ గుండు తగిలి మరణించిన రైతు మృత దేహానికి శవ పరీక్ష జరిపి ఇచ్చిన నివేదికలో తుపాకీ గుండు వలన గాయం అయిందన్న వాస్తవాన్ని కప్పిపుచ్చారు. మొత్తం యు.పి ప్రభుత్వ యంత్రాంగం అంతా వాస్తవాలను కప్పిపుచ్చి తారుమారు చేసే ప్రయత్నంలో తలమునకలైవుంది. ఇంకోవైపు రైతులమీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు.
    బాధిత కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన ప్రతిపక్షాల నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. బాధితులను అందరికన్నా ముందు పరామర్శించి, ఓదార్చవలసినది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి. ఆ పని చేయకపోగా పరామర్శించేందుకు వెళ్ళిన నేతలను నిర్బంధించడం చూస్తే బిజెపి ప్రభుత్వం బొత్తిగా ఉచితానుచితాలను మరిచిపోయిందని తేటతెల్లం ఔతోంది.
    లఖింపూర్‌ సందర్శనకు బయలుదేరిన పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రుల హెలికాప్టర్ల ల్యాండింగ్‌కు అనుమతులు నిరాకరించారు. అఖిలేష్‌ యాదవ్‌, ప్రియాంక వాద్రాలకూ నిరాకరించారు. వామపక్ష నాయకులను ఢిల్లీ లోనే అడ్డుకున్నారు. పాత్రికేయులకు ప్రవేశాలు లేవు. పంజాబ్‌ నుండి తమ రాష్ట్రం లోకి ఎవరూ రాకుండా అడ్డుకోమని ఆ పంజాబ్‌ ప్రభుత్వాన్ని కోరింది యు.పి ప్రభుత్వం. తమ రాష్ట్రంలో తలెత్తిన శాంతి, భద్రతల సమస్య విషయంలో పొరుగు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడానికి కూడా వెనుకాడని అనుచిత వైఖరిని ప్రదర్శించింది.
    గత ఏడాది హత్రాస్‌ లో మానభంగానికి గురై మరణించిన యువతి మృతదేహానికి హడావుడిగా అర్ధరాత్రి అంత్యక్రియలు జరిపించి నిజానిజాలను వెలుగు లోకి రాకుండా చూసే ప్రయత్నాన్ని చేసింది యు.పి పోలీసులే. ఆ కేసు లోని వాస్తవాలను వెలుగు లోకి తేవాలని ప్రయత్నించిన సిద్దిఖీ కప్పన్‌ ఇప్పటికీ బెయిల్‌ కూడా లేకుండా జైలులోనే మగ్గుతున్నాడు. అతని నివేదిక వెలుగు చూడలేదింత వరకూ. అప్పుడు కూడా ప్రతిపక్షాలు సమస్యను పెద్దది చేస్తున్నాయని వాటి మీద విరుచుకు పడింది యు.పి ప్రభుత్వం. కప్పన్‌, ప్రతిపక్షాలు ఇక్కడ నేరస్తులైపోయారు.
    తమ ప్రభుత్వాన్ని విమర్శించిన మేథావులను దేశద్రోహ నేరం కింద నిర్బంధించి బెయిలు కూడా నిరాకరించి మోడీ ప్రభుత్వం తన ఫాసిస్టు నైజాన్ని పూర్తిగా తానే బైటపెట్టుకుంది. కేసులు నమోదు చేసి అరెస్టులు చేసి ఏళ్ళు గడుస్తున్నా, చార్జిషీట్లు దాఖలు చేయకుండా కాలక్షేపం చేస్తోంది. ఆ చార్జిషీట్లు న్యాయ పరీక్షకు నిలిచేవికావని తెలుసు కనుకనే ఈ విధంగా కావాలని కాలయాపన చేస్తోంది. నిజాన్ని నిర్భయంగా స్వీకరించే దమ్ము మోడీ ప్రభుత్వానికి లేదని ఈ అనుభవాలన్నీ తెలియజేస్తున్నాయి. కాని మోడీ మాత్రం వ్యవసాయ చట్టాల విషయంలో ''ప్రతిపక్షాలకు మేధోపరమైన నిజాయితీ లోపించిందని'' (ఇంటలెక్చ్యువల్‌ డిస్‌ఆనెస్టీ) తిరిగి ప్రత్యారోపణ చేశాడు. రైతు చట్టాలపై పార్లమెంటులో పూర్తి స్థాయిలో చర్చకు సిద్ధపడని ప్రధానికి ప్రతిపక్షాల నిజాయితీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది ?
    దేశంలో ఇప్పుడు అంతా తలకిందులుగా నడుస్తున్నట్టుంది. పన్నులు ఎగవేయడమే కాకుండా, బ్యాంకుల అప్పులకు ఎగనామం పెట్టిన కార్పొరేట్లు మోడీ దృష్టిలో ''సంపద సృష్టికర్తలు'' అయిపోయారు. సంపదను వాస్తవంగా సృష్టించే రైతులు, కార్మికులు అభివృద్ధి నిరోధకులు అయిపోయారు. వాస్తవాలను వెలుగు లోకి తేవడం జర్నలిస్టుల బాధ్యత. ఆ బాధ్యతను నిర్వహించడానికి పూనుకున్నవారంతా ''దేశద్రోహులు'' అయిపోయి జైళ్ళల్లో బెయిలు లేకుండా మగ్గుతున్నారు. పేదరికం, ఆకలి, అవిద్య, నిరుద్యోగం, పోషకాహార లోపం, సంపదలో అసమానతలు పెరిగిపోతోంటే మోడీకి మాత్రం దేశం ''వెలిగిపోతోంది''. ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీయడం ప్రతిపక్షాల బాధ్యత. ఆ పని చేస్తున్నందుకు వారికి ''మేధోపరమైన నిజాయితీ లోపించిందని'' మోడీ విమర్శిస్తున్నాడు.
తాగి, మత్తెక్కి, మంచానికి అడ్డంగా పడుకుని తలకిందులుగా లోకాన్ని చూస్తూ తక్కిన జనాలంతా తలకిందులుగా నడుస్తున్నారని ఆరోపించేవాడి చందం ఇది.


ఎం.వి.ఎస్‌. శర్మ

ఎం.వి.ఎస్‌. శర్మ