ప్రజాశక్తి-చీరాల: సివిల్స్ పరీక్ష నేపథ్యంలో విద్యార్థిని శ్రావణి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పాఠకులకు తెలిసిందే. విద్యార్థిని తల్లిదండ్రులు గోలి ఆనంద్, కుమారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి బాలినేని వాసు, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి శనివారం ఈపురిపాలెంలోని విద్యార్థిని స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా విద్యార్థిని శ్రావణి చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని వాసు మాట్లాడుతూ విద్యార్థిని కుటుంబానికి తాము అన్నివేళలా అండగా ఉంటామని, విద్యార్థిని మృతి చాలా బాధాకరమని అన్నారు. విద్యార్థులందరూ చదువులను ఇష్టంతో చదువుకొని ధైర్యంతో లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. అంతేగాని ఆత్మహత్యలకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మాజీ ఎమ్మెల్యే ఆమంచి పరామర్శ
విద్యార్థిని శ్రావణి మృతి విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈపురిపాలెంలోని గోలి ఆనంద్ నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. శ్రావణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.










