ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి 'మీరంతా మా కుటుంబం, మీకు అండగా నిలబడటం మా బాధ్యత అని, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే దానిని ఎవరూ తీర్చలేం కానీ మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన 48 క్రియాశీలక సభ్యుల కుటుంబాలతో ఆయన కాకినాడలో ఒక ప్రైవేటు హోటల్లో శనివారం సమావేశమయ్యారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ముగ్గురు జనసేన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఖజానాలో రూ.లక్షల కోట్లున్నా రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని, ఏ అధికారం లేకపోయినా జనసేన పార్టీ సమర్థ వంతంగా చేస్తోందన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యులను సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఆపత్కాలంలో ఆర్థికంగా ఆ కుటుంబాలకు అండగా నిలుస్తోం దన్నారు. ప్రమాదవశాత్తు ఏ క్రియాశీలక సభ్యుడు చనిపోయినా, గాయపడినా తక్కువ సమయంలో ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీ క్రియాశీల సభ్యులకు ప్రమాద బీమా చేయించే ఆలోచన ఉన్నతమైనదన్నారు.90 వేల మంది క్రియాశీలక సభ్యులుగా చేరితే, ఈ ఏడాది ఆ సంఖ్య 6.76 లక్షలకు చేరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పిఎసి సభ్యుడు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, మేడా గురుదత్తప్రసాద్, బండారు శ్రీనివాస్, తుమ్మల బాబు,మాకినీడు శేషుకుమారి, పోలిశెట్టి చంద్రశేఖర్, సంగిశెట్టి అశోక్, వరుపుల తమ్మయ్య బాబు, పాటంశెట్టి సూర్యచంద్ర, వై.శ్రీనివాస్ పాల్గొన్నారు.










