
ఈ బాడుగ రేటు ఎంత కాలం అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒక సీజనుకు మాట్లాడుకున్నది ఆ సీజనంతా ఇవ్వాల్సిందే, బాగా ఆడినా ఆడక పోయినా. అయితే ఇన్ని సిక్సర్లు బాదితే, ఇన్ని ఫోర్లు కొడితే, ఇన్ని వికెట్లు తీస్తే అదనంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు, బోనసులు ఇవ్వొచ్చు కాని అది గ్యారెంటీ లేనిది. ఈ సీజనులో ఆడే, గెలిచే మ్యాచుల మీద రాబోయే సీజనులో ఇచ్చే బాడుగ రేటు ఆధారపడి ఉంటుంది. అందుకే వొళ్ళు దగ్గర పెట్టుకొని ఆడతారు.
బాడుగ కాలం అంటే అదేదో కాలం బాడుగకు దొరుకుతుందని అనుకునేరు. అది ఎలాగూ కాదు. ఇరవై నాలుగు గంటలే అందరికి. అయితే ఆ ఛబ్బీస్ గంటల్లో మనం ఎలా గడుపుతున్నాము. ఎంతమందిని బాడుగకు తీసుకుంటున్నాము? ఎంతమందిని బాడుగకు అమ్ముడుపోతున్నాము? ఇలాంటి ప్రశ్నలు అందరూ కాదు కాని ఈ మధ్య చాలామంది తమకు తాము వేసుకోవలసినవి తయారైనాయి. ఎవరి పనులు వాళ్ళకున్నాయి. అలాంటిది ఇంకొకరి దగ్గర బాడుగకు ఎందుకు పోతారు అనుకునే అవకాశమూ ఉంది. తన పనే చూసుకోవాలా లేదా ఇతరుల పనికి పోవాలా అన్న విషయం చేతికి వచ్చే డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. అదే అందరినీ, అన్నింటినీ నడిపిస్తుంది. దానికి లొంగని వాళ్ళూ కొందరుంటారు, అది వేరే సంగతి. డబ్బు, కాలం అన్న అంశాలు ఒక్కో కాలంలో ఒక్కో విధంగా చూడబడుతుంటాయని తెలుసుకోవాలి. చిన్నప్పుడు లెక్కల్లో కాలము, పని అనే అధ్యాయం ఉండేది. అక్కడ పని అంటే డబ్బు అని వేరే చెప్పే పనే లేదు. అస్సలు బాడుగ, జీతం ఏమీ తీసుకోకుండా ఒకరి పొలాల్లో ఒకరు పని చేసిన రైతన్నల కాలం దాటి మనం చాలా దూరం వచ్చేశాం.
మనిషికి ఏ బాడుగ లేకుండా అడవుల్లోకి పోయి నీగ్రోలను పట్టుకొచ్చి వాళ్ళకింత తిండి పెట్టి పని చేయించుకున్న వాళ్ళని కూడా చరిత్ర చూసింది. తరువాత దొంగ లెక్కలు వేసి వెట్టికి పని చేయించుకున్న కాలమూ పోయింది. ఇప్పుడు అలా పట్టుకొచ్చె అవసరం లేకుండా, వెట్టి కాకుండా తామే సొంతంగా బాడుగకు వచ్చే మనుషులు దొరుకుతున్న 'మంచి' కాలంలో మనం జీవిస్తున్నాం. ప్రపంచంలో ఇప్పుడు ఫలానా చోటికి పోయి వ్యాపారం చేయాలన్న రూలేమీ లేదు. సెల్లులో ఒక్క బటన్ నొక్కితే చాలు మన డబ్బు గాల్లో ప్రయాణించి షేర్... మార్కెట్లతో పాటు అన్నింటి ధరలనూ పెంచొచ్చు, తగ్గించనూ వచ్చు. డబ్బు కాలమంటే బాడుగ కాలమే.
కొన్ని ఆటలున్నాయి. దేశదేశాలకూ ఆ ఆటల్లో ఎవరి జట్లు వాళ్ళకున్నాయి. వాటిల్లోని ఆటగాళ్ళను కొని తమకు అనుకూలంగా ఆడమని బయట పందేలు వేసుకునే వాళ్ళు. ఇంతకు ముందు బేరాలు పెట్టేవాళ్ళు. అది కాస్తా బయటకు పొక్కి అంతా గందరగోళం అయ్యే పరిస్థితి వచ్చేటప్పటికి అందరూ సర్దుకున్నారు. ఇక లాభం లేదు, ఇలా ఒక జట్టు లోని వాళ్ళను కొనడం వల్ల టైం వేస్టు, డబ్బు వేస్టు అని కనుక్కున్నారేమో, వివిధ దేశాల జట్ల నుండి బాగా ఆడేవాళ్ళను వేలంలో కొనేస్తున్నారు. ఇదేదో వేలమని నేను వాడడం లేదు. వాళ్ళే బిడ్లు వేసి ఒక్కొక్కరినీ ఇంతకు కొన్నామని గర్వంగా ప్రకటిస్తున్నారు. ఫలానా ఆటగాడు ఇన్ని కోట్లకు అమ్ముడుబోయాడు, ఫలానా టీము కొనుక్కుంది అని వాళ్ళే రాస్తున్నారు, చెబుతున్నారు. ఇక కరోనా లెక్కలో లేదు. ఎండలు అస్సలు అడ్డు రావు. పెట్రోలు, డీజిలు, గ్యాసు, మందులు ఇంకా ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. మనుషుల మధ్య అంతరాలను పెంచే రాజకీయాలు చేస్తున్నారు అనే విషయాలు ఆలోచించకుండా, ఆలోచించనీయకుండా మ్యాచులు పెట్టి, ఫోర్లు, సిక్సర్లు కొట్టిస్తూ, టీవీల్లో ప్రకటనలు గుప్పిస్తూ బాడుగ ఆట చుట్టూ డబ్బు స్వేచ్ఛగా విహరిస్తోంది.
ఈ బాడుగ రేటు ఎంత కాలం అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒక సీజనుకు మాట్లాడుకున్నది ఆ సీజనంతా ఇవ్వాల్సిందే, బాగా ఆడినా ఆడక పోయినా. అయితే ఇన్ని సిక్సర్లు బాదితే, ఇన్ని ఫోర్లు కొడితే, ఇన్ని వికెట్లు తీస్తే అదనంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు, బోనసులు ఇవ్వొచ్చు కాని అది గ్యారెంటీ లేనిది. ఈ సీజనులో ఆడే, గెలిచే మ్యాచుల మీద రాబోయే సీజనులో ఇచ్చే బాడుగ రేటు ఆధారపడి ఉంటుంది. అందుకే వొళ్ళు దగ్గర పెట్టుకొని ఆడతారు. దీపముండగానె ఇల్లు దిద్దుకోర తమ్ముడు అన్నట్టు తాకత్ ఉన్నప్పుడే కమాయించుకోవాలి అన్నది అందరికీ వర్తించే సూత్రం. తనను తాను సంపాదించుకుంటోంది డబ్బు. అలా ఈ డబ్బు సంపదగా మారి... తన గురించి మార్క్సు మహనీయుడు, చెప్పిన మాటలు నిజమని నిరూపిస్తోంది. ఈ భూమి ఒక్కటే కాదు చంద్ర మండలాన్ని, గురు గ్రహాన్ని కూడా ఆక్రమించి అక్కడా బాడుగకు విహార కేంద్రాలు ఏర్పాటు చేసే పనిలో ఉంది డబ్బు.
అంతెందుకు? పల్లె బస్సుల్లో ఒక రేటు, ఎక్‌ప్రెస్, హైటెక్కు, స్లీపరు ఇలా బస్సుల్లో, టూ టైర్, త్రీ టైర్, ఏసీ, స్లీపరు అని రైళ్ళలో ప్రయాణించినప్పుడు బాడుగల్లో తేడాలుంటాయి. ఇక నగరాల్లో అయితే సిటీ బస్సులు, అందులో రకాలు, ఆటోలు, లోకల్ రైళ్ళు, మెట్రో రైళ్ళు ఇలా రకరకాల వాహనాలు రకరకాల బాడుగకు దొరుకుతాయి. అది సహజం. అయితే ఇక్కడ సేవలకు రుసుముగా మాత్రమే తీసుకుంటారు. పండుగలప్పుడు ప్రత్యేక బస్సులు వేసి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం చూస్తుంటాము, ఇవి ఐపిఎల్ మ్యాచులను గుర్తుచేస్తాయి. కాదేదీ మార్కెట్టుకు అతీతం అన్నది ఈ బాడుగకు బాగా సరిపోతుంది. అద్దె కొంపల్లో విసుగొచ్చేంత కాలం ఉన్నవాళ్ళ నోటి నుండి ఈ బాడుగ బతుకులు ఎప్పుడూ ఇంతే, బాగుపడవు అన్న మాటలు వింటూ ఉంటాము. ఇప్పుడు వాటి పరిధి దాటిపోయింది.
ఆయనెవరో ఉన్నాడంట. కేంద్రంలో కాని, రాష్ట్రంలో కాని అధికారంలోకి రావాలంటే సూచనలు, సలహాలు, ఎత్తుగడలు ఇస్తాడట. అంతే కాదు, ఎవరెవరు ఏ డైలాగులు మాట్లాడాలి, వాట్సాప్, ఫేసుబుక్, ట్విట్టర్లలో ఎలాంటి పోస్టులు పెట్టాలి మొదలైనవి అన్నీ రాసిస్తాడట. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అన్నీ తానే దగ్గరుండి మరీ చూసుకుంటాడట. అయితే బాడుగకే పని చేస్తాడు. ఒకే పార్టీకే పని చేస్తాడా అన్న అనుమానం వస్తుంది. అదేం లేదు. ఏ పార్టీకైనా సరే రాసిస్తాడు. పైసలివ్వాలంతే. రెండు వైపుల పార్టీలకూ రాసిస్తాడా? ఎందుకు రాయడు, మస్తు మస్తుగా రాసిస్తాడు, అయితె పైసల్ ముఖ్యం. అవతలివాడి పైసల్ అయిపోయినా తనకు అవసరం లేదు. ప్రజల గురించి అస్సలు పట్టదు. అమెరికావాడు రెండు దేశాలకూ ఆయుధాలిచ్చి వాళ్ళకు యుద్ధం వచ్చేలా చేసి బాగుపడుతున్న విషయం మీకు గుర్తొచ్చిందంటే మీ మెదడులో కరెక్టు ఆలోచనలు వస్తున్నట్టే లెక్క. ఇదొక టైపు బాడుగ.
ఈ విధంగానే పోతూ ఉంటే కొద్ది కాలానికి బాడుగకు దొరకని వస్తువులు, సేవలు ఉండవేమో అనిపిస్తుంది. ఇవి ఇంకెన్ని కొత్త పుంతలు తొక్కుతాయో కాలమే చెప్పాలి.
/ రచయిత సెల్ : 9849753298 /
జె. రఘుబాబు