ప్రభుత్వ అసంబద్ద, చట్టవ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ప్రజలపై పోలీసులను ఉసిగొల్పి నిర్బంధకాండ ప్రయోగించి, ఆపై లాఠీలతో బాదేస్తుండగా.. ప్రభుత్వం నేరుగా ఛార్జీల మోతతో పేద, మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతోంది..
పోలవరం పనుల్లో నాణ్యతాలోపంపై వార్తలు వెలువడటంతో ఆ పనుల పరిశీలనకు బయల్దేరిన టిడిపి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని నిర్బంధించారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ, జవహర్‌ను బుట్టాయగూడెం పోలీసు స్టేషన్‌లో నిర్బంధించగా పాలకొల్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు తదితరులను వివిధ చోట్లకు తిప్పి, వాహనాలు మార్చి చివరకు స్వగృహానికి చేర్చారు. ఇప్పటికే సిఎం పర్యటనల సందర్భంలోనూ మీడియాను సైతం ఒకచోట ఉంచి ఫొటోలిస్తాం.. వివరాలిస్తాం కవరేజీ ఇవ్వండి అంటూ ప్రభుత్వం నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తోంది. సిఎం భద్రతరీత్యా అని సరిపెట్టుకుందామంటే సాధారణ రోజుల్లోనూ ప్రాజెక్టు పనుల పరిశీలనకు ముందస్తు అనుమతి లేకపోతే మీడియాను సైతం అనుమతించడం లేదు. ఏదోవిధంగా వెళ్లినా ఇతర దేశాల్లోకి వెళ్లినట్లుగా నిరంతరం ఎవరోకరు అనుసరిస్తూ అటు వెళ్లొద్దని, ఇటు వెళ్లొద్దని ఆంక్షలు విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పనుల్లో నాణ్యతాలోపంపై పరిశీలనకు బయల్దేరిన టిడిపి నేతలను అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. అనుమతి తీసుకోకపోవడం వల్లే అడ్డుకున్నామని పోలీసు అధికారులు ప్రకటించారు. వాస్తవంగా అనుమతి కోరితే ఈ అధికారులు ఇస్తారా అనేది అనుమానమే. పనుల్లో నాణ్యతా లోపాలేమీ లేవని అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు అధికారులు సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. అదే నిజమైతే టిడిపి నేతలను ఎందుకు పనుల పరిశీలనకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారనే దానికి ఏఒక్కరి వద్దా సమాధానం లేదు.
అయితే ఇక్కడ కూడా టిడిపి గతంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించినట్లే ఇప్పుడూ పనులపైనే దృష్టి పెట్టి పోరాటాలకు సిద్ధమవుతుంది తప్ప ప్రాజెక్టులో జల సమాధి అవుతున్న నిర్వాసితుల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిహారం, ప్యాకేజీ, పునరావాసం గురించి టిడిపి ప్రభుత్వ హయాంలో పట్టించుకున్న దాఖలాల్లేవు. పైగా బలవంతంగా కొన్ని గ్రామాలను ఖాళీ చేయించిన పరిస్థితి ఉంది. అయితే తర్వాత అధికారంలోకొచ్చిన వైసిపి ప్రభుత్వం సైతం అదే ధోరణి ప్రదర్శిస్తోంది. పైకి సానుభూతి మాటలు చెబుతున్నా కార్యాచరణలో సాయం అందించకపోగా వరద బారిన వదిలేసి 'పొమ్మనలేక పొగబెట్టిన' చందంగా వ్యవహరిస్తోంది.
చించినాడలో గోదావరి పెరుగులంక భూముల వ్యవహరంలోనూ ప్రభుత్వం తీరు అత్యంత జుగుప్సాకరంగా మారింది. 'నవ్విపోదురు నాకేటీ సిగ్గు' అనే చందంగా ప్రభుత్వ పరువు బజారున పడుతున్నా మట్టి తవ్వకాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. జిల్లా అధికారులు సైతం ప్రజాప్రతినిధుల ఒత్తిడో.. అధికారం అండగా ఉందనో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. పోలీసుల రక్షణ నడుమ అక్రమ దందా సాగించడం వైసిపి పాలకులకే చెల్లిందనే వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి. రాజకీయంగా ఎదుగుదలలో ఎవరి సలహాలు తీసుకున్నామో.. ఎవరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగామో అనేది మరిచారో ఏమో సదరు అధికార పక్ష ప్రజాప్రతినిధులు కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలు వారి అహంకారపూరిత వైఖరికి నిదర్శనంగాను, అవగాహనారాహిత్యానికి ప్రతిబింబంగానూ ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. దిగువస్థాయి నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా ప్రజల పక్షంగా లేకపోతే 'రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్యహత్యలే' అనే పరిశీలకుల వ్యాఖ్యానం రానున్న రోజుల్లో అధికారపక్షానికి తప్పదని అంతా చెబుతున్నారు. చలో చించినాడ పేరిట నిర్వహించిన సభకు సైతం పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఆపై భూముల పరిశీలనకు బయల్దేరిన నేతలను ప్రధానంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పాలకొల్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, ఇతర ప్రజాసంఘాల నేతలను ఈడ్చుకుంటూ లాక్కెళ్లి వ్యాన్‌ల్లోకి ఎక్కించిన తీరు ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా లేదా అనే అనుమానం కల్గించింది. నేతలను తరలిస్తున్న వాహనాన్ని ఎక్కడికక్కడ సిపిఎం, టిడిపి శ్రేణులు అడ్డుకోవడంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆచంట, మార్టేరు, తణుకు మీదుగా తాడేపల్లిగూడెం తీసుకొచ్చి విడిచిపెట్టారు. ప్రభుత్వ విధానాలు, పోలీసులు దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కిన తీరు ఇప్పటికైనా పాలకులు తన పంతం వీడి మట్టి తవ్వకాలను ఆపాలని చెప్పకనే చెబుతోంది.
ఇక ప్రభుత్వం నేరుగా పేదలపై బాదుడుకు తెగబడింది. విద్యుత్ ఛార్జీల మోత, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు భారాలను గుట్టుచప్పుడు కాకుండా ప్రజలపై మోపుతోంది. విద్యుత్ తీగను తాకితే కొట్టే షాక్ ఇక బిల్లును ముట్టుకుంటేనే కొడుతోందని ఈ నెల విద్యుత్ బిల్లులు అందుకున్న వినియోగదారులంతా లబోదిబోమంటున్నారు. ఎన్నికల వేళ కచ్ఛితంగా ప్రభుత్వం తీరు మారకపోతే జిల్లావాసులు అధికారపక్షానికి షాక్ ఇవ్వడం ఖాయమని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
-విఎస్‌ఎస్‌వి.ప్రసాద్










