ప్రజాశక్తి - మంత్రాలయం
టిడిపి అధినేత చంద్రబాబుకు పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసే ధైర్యం కూడా లేదని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటనపై ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి రోడ్డుపై నిరసన చేపట్టారు. ఆదివారం కలుదేవకుంట గ్రామంలో రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏదీ సూటిగా చేయరని, రూట్ మ్యాప్‌ను కాదని పర్యటించి గొడవలు సృష్టించారని విమర్శించారు. అధికారంలో ఉండగా ఏమీ చేయలేని చంద్రబాబు ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రాజెక్టుల పరిశీలనతో తన అక్కసు వెళ్లగక్కడమే కాకుండా ఇలాంటి ట్రిక్కులు ఉపయోగిస్తున్నారని తెలిపారు. 2014 ఎన్నికల్లో బిజెపితో, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని, రానున్న 2024 ఎన్నికల్లో కూడా జనసేనతో పొత్తు పెట్టుకుంటారని తెలిపారు. తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా బరిలోకి దిగి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
నిరసన చేపడుతున్న ఎమ్మెల్యే, నాయకులు










