'బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ'
ప్రజాశక్తి-కావలి : రాష్ట్ర టిడిపి పిలుపునిచ్చిన ''బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ'' కార్యక్రమాన్ని ఆదివారం కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు కావలి పట్టణ 18వ వార్డులో ఇన్‌ఛార్జి శానం హరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో కార్యక్రమానికి సంబంధించి మాలేపాటి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు 'తల్లికి వందనం', ఆడబిడ్డ నిధి, దీపం పథకం ద్వారా ఇంటింటికి ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతన్నలకు ప్రతియేటా రూ.20 వేల ఆర్థిక సహాయం తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందో అంకెలతో సహా వివరించారు. నేడు జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలును రద్దు చేశారని విమర్శించారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారని, మద్యపానం నిషేధం, వద్ధులకు పెన్షన్ రూ.3వేలు చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. ప్రభుత్వం వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలకు పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు భారం చేశారని విమర్శించారు. కల్తీ మద్యం, ఇసుక, మట్టి, దందాలతో వైసిపి నేతలు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డిని ఇంటికి పంపాలంటే రాబోయే ఎన్నికల్లో టిడిపికి మద్దతు ఇవ్వాలని ప్రజలందరినీ కోరారు. అనంతరం స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ పత్రాలను పూర్తి చేసి వారికి అందజేశారు. తదుపరి మహాశక్తి మహిళలు చంద్రబాబు మహిళలకు మేనిఫెస్టోలో ఇచ్చిన సంక్షేమ పథకాలను గురించి అక్కడి మహిళలందరికీ వివరించారు.










