Sep 09,2023 23:18

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, యంత్రాంగం మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై కాకినాడ జిల్లాలో టిడిపి శ్రేణులు నిరసనకు దిగాయి. పోలీసుల సూచనలుతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాకినాడ డిపో పరిధిలో మొత్తం 269 సర్వీసులకు గాను శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ 135 సర్వీసులు మాత్రమే తిరిగాయని డిఎం ఎం.శ్రీనివాసరావు తెలిపారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ కుమార్‌ను ఆయన స్వగ్రామం జగ్గంపేట మండలం ఇర్రిపాకలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, నియోజకవర్గ ఇన్చార్జ్‌ యనమల దివ్యను హౌస్‌ అరెస్టు చేసి నిర్బంధించారు. కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబును శనివారం ఉదయాన్నే అరెస్టు చేసి కోరంగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాకినాడ నగరంలో పలువురు టిడిపి కార్యకర్తలు మెయిన్‌ రోడ్డుపై నిరసన ప్రదర్శన చేశారు. పలు దుకాణాలను మూయించి వేశారు. వారిని అడ్డుకున్న అరెస్ట్‌ చేసి పలు వాహనాల్లో వివిధ స్టేషనులకు తరలించారు. పిఠాపురం మాజీ ఎంఎల్‌ఎ, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌విఎస్‌ఎన్‌.వర్మ కాకినాడలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు ఉదయాన్నే అరెస్టు చేసి కోరంగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
కాకినాడ రూరల్‌ మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి గృహ నిర్బంధం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ మూర్తిని కోరంగి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. రౌతులపూడి పార్టీ మండల అధ్యక్షులు తమరాల సత్యనారాయణ, పైల సాంబశివరావు, పసగడుగుల రమణ, పైలా అశోక్‌, సోమరౌతు రవి ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. ఏలేశ్వరంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్‌ వరుపుల సత్యప్రభను గృహనిర్బంధం చేశారు. దీంతో బాలాజీ చౌక్‌ సెంటర్లో ధర్నా చేపట్టారు. సామర్లకోట రూరల్‌ మఠం సెంటర్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నల్ల కండువాలు ధరించి ఆందోళన చేపట్టారు. వారిని సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్‌, మరో వందమందిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వేట్లపాలెంలో కెనాల్‌ రోడ్డులో టైర్లకు నిప్పంటించి, రోడ్డుపై బైఠాయించారు. తాళ్లరేవు గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద మెయిన్‌ రోడ్డుపై బైఠాయించారు. మానవహారం చేపట్టారు. తాళ్లరేవు సంతపేట సెంటర్‌ నుంచి సిహెచ్‌సి వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కోరంగి పోలీస్‌ స్టేషన్‌ వద్ద పిఠాపురం ఎంఎల్‌ఎ వర్మ, పిల్లి సత్తిబాబు విలేకరులతో మాట్లాడారు. జగ్గంపేట రూరల్‌ మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రు ఇర్రిపాకలో ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్‌ కుమార్‌ నోటికి నల్ల రిబ్బన్‌ కట్టి నిరసన తెలిపారు. కోటనందూరు యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో తుని పట్టణంలో భారీ నిరసన చేపట్టారు. యనమల కృష్ణుడు, గాడి రాజబాబును కోటనందూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కరప ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.