ప్రజాశక్తి - మంత్రాలయం
చంద్రబాబు అక్రమ అరెస్టు వెనుక వైసిపి ప్రభుత్వం కుట్ర ఉందని ప్రజలకు తెలిసిపోయిందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక రాఘవేంద్ర సర్కిల్‌లో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 19వ రోజు సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి సాక్ష్యాధారాలను కోర్టులో చూపెడతామని ఇప్పటికీ సిబిఐ చూపకపోవడం వెనుక గల కారణాలను ప్రజలు గుర్తించాలన్నారు. టిడిపిని దెబ్బ తీసే ప్రయత్నంలో ఒక భాగమే చంద్రబాబు అరెస్టు అన్నారు. మళ్లీ నారా లోకేష్‌ను కూడా అరెస్టు చేసేందుకు చూడడం కక్ష పూరితమని విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత టిడిపి చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. టిడిపి ఆదేశాలతో ప్రతి గ్రామంలో 'భవిష్యత్తు గ్యారెంటీ' పేరుతో ప్రజలను కలిసి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే వైసిపి పాలనలో ప్రజలకు విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరని తెలిపారు. నియోజకవర్గంలో కూడా తిక్కారెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి మండల నాయకులు బూదూరు మల్లికార్జున రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యనిర్వాహక కార్యదర్శి పన్నగ నాగశయన, మీడియా ఇన్‌ఛార్జీ విజయరామిరెడ్డి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు అమర్‌నాథ్ రెడ్డి, ఎస్‌ఎం.గోపాల్ రెడ్డి, మాలపల్లి మాజీ సర్పంచి చావిడి వెంకటేష్, ఎల్లారెడ్డి, నాయకులు అశోక్ రెడ్డి, రచ్చుమర్రి, బండరాయి నరసింహ, సూగూరు, నాగేష్, మారెప్ప పాల్గొన్నారు.
మంత్రాలయంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌రెడ్డి










