హైదరాబాద్ : ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు రానుంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్థ మార్కెట్ రెగ్యూలేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి దరఖాస్తు చేసుకుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదిత విధాన పత్రాలను సమర్పించింది. ఈ ఇష్యూలో రూ.740 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.240 కోట్లు, ప్రమోటర్ల వాటాలను విక్రయించడం ద్వారా మరో రూ.500 కోట్ల నిధులు పొందాలని నిర్దేశించుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,517 కోట్ల రెవెన్యూ నమోదు చేసింది. ప్రతీ ఏడాది సగటున 27 శాతం వృద్థిని సాధిస్తోంది. ఈ ఇష్యూకు యాక్సిస్ కాపిటల్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఎస్‌బిఐ కాపిటల్ మార్కెట్స్, ఆనంద్ రతి సంస్థలు లీడ్ మేనేజర్స్‌గా వ్యవహారించనున్నాయి.