ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి పొట్టకూటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మండుటెండలో ఉపాధి పనులు చేస్తున్నాం. రోజూ పనికి వెళితేనే గాని మాకు పూట గడవదు. ఈ ఎండల్లో ఉపాధి పనులు చేస్తూ అలసట వస్తే విశ్రాంతి తీసుకునేందుకు కనీసం ప్రభుత్వం టెంట్లు కూడా ఇవ్వడం లేదు. ఎక్కడో దూరంగా ఉన్న చెట్ల కిందకు వెళ్లి సేద తీరుతున్నామని సామర్లకోట మండలం చంద్రంపాలెంకు చెందిన ఉపాధి కూలీలు కుడిపూడి లక్ష్మి, ఎలిశెట్టి వీరభద్రరావు, సలాది అబద్ధం ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదు. గతంలో తాగునీరు, మజ్జిగ భత్యాలు ఇచ్చేవారు. మూడేళ్లుగా అందడం లేదని ఇదే మండలంలోని పెద బ్రహ్మదేవరం గ్రామానికి చెందిన మందాల వీరలక్ష్మి, మలకల చినబాబు, పిఠాపురం మండలం గోకివాడ గ్రామానికి చెందిన బిళ్లకుర్తి శ్రీనివాస్, నామా పద్దరాజు తదితరులు తెలిపారు.
కాకినాడ జిల్లాలో 21 మండలాల్లో 3.42 లక్షల జాబ్ కార్డులుండగా 5.96 లక్షల మంది కూలీలు నమోదయి ఉన్నారు. వీరిలో 4,59,414 వేతనదారులు రెగ్యులర్‌గా పనులకు వెళుతున్నారు. ప్రస్తుతం ఈ వేసవిలో 40 నుంచి 44 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సుమారు 87 వేల మంది పనులకు వెళుతున్నారు. ఈ పథకం పనుల్లో భాగంగా ప్రభుత్వ స్థలాలు, రైతుల పొలాల గట్లపై మొక్కలు పెంపకం, చెరువులు, పంట కాలువల్లో పూడిక పనులు చేస్తున్నారు.
పని ప్రదేశంలో కొరవడిన భద్రత
ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. దానికి తోడు వడ గాలులు వీస్తున్నాయి. అయినా గ్రామీణ వ్యవసాయ కార్మికులు కుటుంబాలను పొషించుకునేందుకు పనులకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ఎండలను తట్టుకోలేక వడ దెబ్బ తగిలి పడిపోతున్నారు. అయినా పని ప్రదేశంలో ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. దీనిపై ప్రజాశక్తి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయగా పలువురు తమ ఆవేదన వెలి బుచ్చారు. సామర్ల కోట మండలంలో 7,195 మంది యాక్టివ్ కూలీలు ఉండగా ప్రస్తుతం 3,550 మంది పనులకు వెళుతున్నారు. పని ప్రదేశాల్లో నిలువ నీడ, తాగేందుకు గుక్కెడు నీళ్ల కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొంతమంది ఇళ్ల నుంచి తెచ్చుకున్న నీటితో సరిపెడుతున్నారు. ఈ మండలం చంద్రపాలెంలో 1500 మంది కూలీలుండగా 290 మంది పనులకు వెళుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 23 ఎకరాల మసీదు చెరువు పూడిక పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తయిన తర్వాత సమీపంలో ఉన్న చెట్ల కిందకు వెళ్లి సేద తీరాల్సి వస్తోంది. పిఠాపురం మండలం రాయవరంలో 350 మంది పని చేస్తున్నారు. వీరు సేద తీరుదామన్నా సమీపంలో చెట్లు కూడా లేవు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందుబాటులో లేదు. ఎన్‌ఐసి సర్వర్ లోకి మారడంతో సౌకర్యాలు అండడం లేదని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో పని ప్రాంతాల్లో తమకు సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ కార్మికులు కోరుతున్నారు.










