ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్:మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును గురువారం తెల్లవారు జామున సిఐడి పోలీసులు అరెస్టు చేసినప్పటి నుండి ఆయన ఇంటి వద్ద అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కొలహాలంగా మారింది. అయ్యన్న రిమాండ్‌ను కోర్టు తిరస్కరించడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో శుక్రవారం పలురువు సంబరాలు చేసుకున్నారు. నాయకులు వస్తూ అయ్యన్నను పరామర్శిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు.
అయ్యన్నకు పప్పల పరామర్శ
నర్సీపట్నం రూరల్:మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాజేష్‌లను మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు పరామర్శించారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ, ప్రహరీ గోడ నిర్మాణానికి, సిఐడి అధికారులకు ఏమి సంబంధం అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని మెప్పించేందుకు సిఐడి పని చేస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించినందుకు అయ్యన్న కుటుంబాన్ని ఇబ్బందులు గురి చేస్తుందని, ఇది సరి కాదన్నారు.
కార్యకర్తలకు రుణపడి ఉంటా :అయ్యన్న
నర్సీపట్నం రూరల్: తాను ఇప్పటి వరకు తెలిసి తప్పు చేయలేదని, భవిషత్తులో చేయనని, తన కుటుంబానికి అండగా నిలిచిన కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానని మాజీమంత్రి, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. బెయిల్ మంజూరు కావడంతో నర్సీపట్న వచ్చిన అయ్యన్నపాత్రుడుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మేళతాళాలతో స్వాగతం పలికి పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఇంటికి చేరుకున్న అయ్యన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తనను ఏమి చేయలేరని, ఈ కారణంతోనే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. పరిపాలన చేతకాక, ప్రజలను మభ్యపెట్టేందుకు తమపై కేసులు పెట్టి ఎన్నాళ్లు కాలం గడుపుతారని ప్రశ్నించారు. తనపై 14 కేసులు పెట్టి ఏమి చేశారన్నారు. అధికార పక్షం తప్పు చేస్తే విమర్శించడం ప్రతిపక్షంగా తమ ధర్మమని, వీలైతే చేసిన తప్పులను సరి చేసుకోవాలన్నారు.
గొలుగొండ: మండలంలోని ఏఎల్‌పురం చుట్టుపక్కల గ్రామాల టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బైక్ ర్యాలీగా నర్సీపట్నంలోని మాజీ మంత్రి అయ్యన్న ఇంటికి చేరుకున్నారు. అనంతరం వారంతా కలిసి తమ అయ్యన్నతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి చిటికెల తారకవేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తున్న తమ నాయకుడికి తామంతా అండగా ఉంటామని తెలిపారు.










