Nov 03,2022 23:32

అనకాపల్లిలో జగదీష్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు

మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడును గురువారం తెల్లవారు జామున అరెస్టు చేయడంతో అనకాపల్లి జిల్లాలో ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. నర్సీపట్నంలో బంద్‌ సంపూర్ణమైంది.
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టుతో నర్సీపట్నంలో టిడిపి నేతలు ఆందోళన చేపట్టారు. అయ్యన్న అరెస్టుకు నిరసనగా బంధ్‌కు పిలుపునివ్వడంతో చిన్నపాటి షాపులు సైతం స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. ఒక్క మెడికల్‌ షాపులు, ఆస్పత్రులు తప్పితే మిగతా ఏ షాపులు తెరవలేదు. ముందుగా కొన్ని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 10:30 నుండి సెలవులు ప్రకటించాయి.
మాడుగుల: మాడుగుల టిడిపి నేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాడుగుల నేతలు బస్టాండ్‌లో నిరసన చేపట్టేందుకు తరలిరాగా ఎస్సై దామోదర్‌ నాయుడు వీరిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పుప్పాల అప్పలరాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఉండూరు దేముడు, లెక్కల కాశిబాబు, వేగి రాంబాబు, రంజిత్‌ వర్మ, సూర్యనారాయణరాజు తదితర నేతలను అరెస్టు చేశారు. అనంతరం పూచికతుపై విడుదల చేశారు.
˜గొలుగొండ:ఏఎల్‌పురం గ్రామంలోని శరభన్నపాలెం కూడలి వద్ద టీడీపీ కార్యకర్తలు, నాయకులు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టుకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిటికెల తారకవేణుగోపాల్‌, ఏఎల్‌పురం టీడీపీ గ్రామ ప్రెసిడెంట్‌ బొడ్డు జమీలు పాల్గొన్నారు.
కోటవురట్ల: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టుకు మండల కేంద్రంలో టిడిపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ విగ్రహం వద్ద రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. అనంతరం ప్రధాన కూడలిలో రోడ్లపై బైఠాయించారు. ఈ సందర్భంగా మండల టిడిపి అధ్యక్షులు జానకి శ్రీను మాట్లాడుతూ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వేచలపు జనార్ధన్‌, తెలుగు యువత అధ్యక్షులు తిరుమలరావు, సుంకర బాబ్జి, చిటికెల సత్యనారాయణ, నంబారు రాము, సహా పలువురు టిడిపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు.
రోలుగుంట:మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్టు అప్రజాస్వామ్యమని తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి యాత రాష్ట్ర కన్వీనర్‌ ఒనుం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి గోడలు దూకి దాడి చేసి నర్సీపట్నంలో అయ్యన్నను ఆయన కుమారుడుని అరెస్ట్‌ చేయడం సరికాదన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తుందన్నారు.
అనకాపల్లి : అనకాపల్లిలోని టిడిపి పార్లమెంటరీ కార్యాలయానికి వెళ్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగ జగదీష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. జగదీష్‌ మాట్లాడుతూ, జగన్‌రెడ్డి నిరంకుశ పాలనకు పోలీసులు సహకరించడం బాధాకరమని, ప్రజాస్వామ్యయుతంగా నిరసన చేపట్టాలని భావిస్తే పోలీసులు అడ్డుకోవడం భావ్యం కాదన్నారు. టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు ప్రసాద్‌ పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర బిసి నాయకులపై ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కక్ష కట్టారని, అందులో భాగంగా అయ్యన్న అరెస్టని మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ ధ్వజమెత్తారు. అయ్యన్న అరెస్టను నిరసిస్తూ పట్టణంలోని రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
బుచ్చయ్యపేట : అయ్యన్న అరెస్ట్‌ను నిరసిస్తూ చోడవరంలో చేపట్టే ఆందోళనకు మండలంలోని పలు గ్రామాల నుంచి టిడిపి శ్రేణులు తరలివెళ్లారు. అయ్యన్న అక్రమ అరెస్ట్‌ను మండల పార్టీ అధ్యక్షుడు గోకవాడ కోటేశ్వరరావు ఖండించారు.
మునగపాక రూరల్‌: ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కులను సైతం ప్రభుత్వం, పోలీసులు కాలరాయడం దుర్మార్గమని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు అన్నారు. నాగులపల్లిలోని అతని నివాసంలో పోలీసులు గహ నిర్బంధం చేశారు. శ్రీనివాసరావుతోపాటు పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చోడవరం : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టుకు నిరసనగా చోడవరం టిడిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్య బాబు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి మల్లునాయుడు, మండల టిడిపి అధ్యక్షుడు బి నాగగంగాధర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గౌరీశంకర్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
దేవరాపల్లి : రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మండిపడ్డారు. దేవరాపల్లి నాలుగురోడ్లు జంక్షన్‌ దరి అంబేద్కర్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి, సూర్యనారాయణ పూలమాలవేసి నివాళులర్పించారు.
కె.కోటపాడు: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టును నిరసిస్తూ కోటపాడు మూడు రోడ్ల కూడలిలో ధర్నా రాస్తారోకో చేపట్టింది. మాడుగుల టిడిపి ఇన్‌ఛార్జి పివిజి కుమార్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం, పోలీసుల వైఖరికి నిరసనగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును పైలా ప్రసాదరావు ఖండించారు.
పరవాడ: మాజీ మంత్రి అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పరవాడ మాజీ ఎంపిపి మాసవరపు అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్నా డిమాండ్‌ చేసారు. వెన్నెలపాలెం జంక్షన్‌లో వియ్యపు చిన్నా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
నక్కపల్లి:నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌ను నిరసిస్తూ నక్కపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టిడిపి శ్రేణులు నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత నిరసనలో పాల్గొన్నారు.అయ్యన్న అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. నేతలు కొప్పిశెట్టి వెంకటేశ్‌, అమలకంటి అబద్ధం, జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ మాజీ సభ్యులు కొప్పిశెట్టి కొండబాబు పాల్గొన్నారు.