Nov 03,2022 23:25

అరకులోయలో ఆందోళన చేపడుతున్న టిడిపి నేతలు

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌:మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌కు నిరసనగా గురువారం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ఆందోళన చేశారు. అక్రమంగా ఆయనను అరెస్టు చేశారని నిరసిస్తూ పట్టణంలోని పాత బస్‌ స్టాండ్‌ అంబేద్కర్‌ విగ్రహం ఎదుట మోకాళ్లతో నిరసన చేపట్టారు. అయ్యన్నపాత్రుడిని తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు బొర్రా నాగరాజు, కోడ వెంకట సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ అర్ధరాత్రి అరెస్టులు చేయడం ప్రభుత్వ ఆటవిక, దుర్మార్గపు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్నారని అయ్యన్నపాత్రుడిపై ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. వెంటనే అయ్యన్నను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
అరకులోయరూరల్‌: మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడును అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్ను దొర విమర్శించారు. అరెస్టును ఖండిస్తూ గురువారం అరకులోయ మండల కేంద్రంలోని టీడిపి శ్రేణులు నాలుగు రోడ్ల వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దొన్నుదొర మాట్లాడుతూ, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యం గొంతునొక్కడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షులు శెట్టి బాబురావు, పెదలబుడు సర్పంచ్‌ దాసుబాబు, మాజీ ఎంపీపీ పొద్దు అమ్మన్న, మాదల సర్పంచ్‌ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్‌ విజయ నిర్మల, మాజీ ఎంపీటీసి కుమార్‌, మహిళా నాయకురాలు బుర్జా లక్ష్మీ, ద్రౌపతి పాల్గొన్నారు.
డుంబ్రిగూడ:అయ్యన్నపాత్రుడుని అరెస్టు చేయడా న్ని నిరసిస్తూ మండల కేంద్రంలోని మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద టిడిపి నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు టి.సుబ్బారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తుందని విమర్శించారు. తక్షణమే అయ్యన్న పాడ్రుడను విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకులు కే సుబ్బారావు, టిఎన్‌టియుసి అరకు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి ఎం.స్వామి, ఆనంద్‌, ఏ.త్రినాధ్‌, మాజీ సర్పంచ్‌ సిహెచ్‌ వెంకటరాజు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కిలో బలరాం ఆధ్వర్యాన అంబేద్కర్‌ పార్క్‌ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ, అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను అర్ధరాత్రి సిఐడి పోలీసుల అరెస్టు చేతకానితనమే అన్నారు. నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్‌ మహిళ ప్రధాన కార్యదర్శి కిలో సన్యాసమ్మ, వనబసింగి సర్పంచ్‌ వి.లక్ష్మణ్‌, మాజీ ఎంపీటీసీ ఉబ్బన్న, మజ్జి చిన్ని బాబు, వంతల చిన్ని పాల్గొన్నారు.
కొయ్యూరు : మాజీ మంత్రి, టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవివి ప్రసాద్‌ కోరారు. గురవారం అయ్యన్న అరెస్ట్‌ను ఖండిస్తూ మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, వైసిపి ప్రభుత్వం తనతీరు మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి నేత బషీర్‌ ఖాన్‌, రాజేంద్రపాలెం సర్పంచ్‌ పాల్గొన్నారు.
రాజవొమ్మంగి :టిడిపి ముఖ్యనేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అక్రమ అరెస్టు వైసిపి ప్రభుత్వ పిరికిబంద చర్య అని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ టిడిపి ఉపాధ్యక్షుడు దంతులూరి శివరామ చంద్రరాజు, మండల అధ్యక్ష, కార్యదర్శులు గొల్లపూడి పెద్దిరాజు, ముప్పన డింబకేశ్వరరావు ఆరోపించారు. అయ్యన్న అరెస్ట్‌ను నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో అల్లూరి జంక్షన్‌లో ధర్నా నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయ్యన్నపాత్రుడు, రాజేష్‌ల అరెస్ట్‌ చేసిన తీరు చూస్తే వారి కుటుంబంపై ప్రభుత్వం ఎంతగా కక్షపూనిందో స్పష్టమౌతోందన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు జెట్టి మధు, పెదిరెడ్ల సత్తిబాబు, ఎల్‌ లక్ష్మణరావు, వీరబాబు, ఎం గోపి పాల్గొన్నారు.
చింతూరు: ప్రశ్నించే హక్కును కాలరాస్తూ విపక్ష నేతలపై వైసిపి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందనడానికి మాజీ మంత్రి అయ్యన్న, అనతి కుమారుడి అరెస్ట్‌ నిరద్శనమని మండల టిడిపి నేతలు ధ్వజమెత్తారు. అయ్యన్న అరెస్ట్‌ను ఖండించారు. కార్యక్రమంలో చింతూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇల్లా చిన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వరావు, గెడ్డం సురేష్‌చౌదరి, వీ శ్రీరామ్‌ రెడ్డి, శ్రీరామ్‌, సాల్మన్‌ రాజు, పొదిలి రామారావు పాల్గొన్నారు.