May 24,2022 06:10

     న చుట్టూ మనం ఏర్పరుచుకున్న కాలుష్యాలే మన ఊపిరి తీస్తున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతీ సంవత్సరం లక్షలాది మంది ప్రజలు కాలుష్యం వలన మృత్యువు బారిన పడుతున్నారు. విశ్వవ్యాప్తంగా చూస్తే ప్రతి ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నట్లు తాజాగా లాన్సెట్‌ నివేదిక ద్వారా వెల్లడయ్యింది. అంతే కాదు. 2019లో వివిధ రకాల కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది మరణించారని...ఈ మొత్తం కాలుష్య మరణాలలో కేవలం వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో ఒక్క ఏడాదేలోనే 66 లక్షల మంది బలయ్యారని నివేదిక తెలిపింది.
     అన్ని రకాల కాలుష్యాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది ప్రతి లక్ష మందికి సగటున 117 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో అత్యధికంగా సెంట్రల్‌ ఆఫ్రికా దేశమైన చాద్‌ లో ప్రతి లక్ష మందికి 300 మంది చనిపోతుండగా అతి తక్కువ కాలుష్య కారక మరణాలు బ్రునై, ఖతార్‌, ఐస్లాండ్‌ లలో చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచం లోని ఇతర దేశాలతో పోలిస్తే కాలుష్య మరణాలలో మన దేశం అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. అన్ని రకాల కాలుష్యాల కారణంగా భారత దేశంలో ఒక్క (2019) ఏడాది లోనే 23 లక్షల అకాల మరణాలు సంభవించగా వీటిలో 16 లక్షల మంది మన దేశంలో కేవలం వాయు కాలుష్యం వల్లే మరణించినట్లు నివేదిక తెలిపింది. కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల కారణంగా దేశంలో రోజుకు సగటున 6,500 మరణాలు జరుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది కరోనా మహమ్మారి సమయంలో మరణించిన వారి కంటే చాలా రెట్లు ఎక్కువ. భారతదేశంలో వాయు కాలుష్య సంబంధిత మరణాలు (9.8 లక్షలు) పరిసర పి.ఎం 2.5 కాలుష్యం వల్లనే సంభవించాయని ఈ నివేదిక ప్రధాన సారాంశం. పీఎం అంటే పర్టిక్యులేట్‌ మేటర్‌ (అత్యంత సూక్ష్మమైన దుమ్ము, ధూళి కణాలు). 2.5 మైక్రో మీటర్లకన్నా చిన్నవాటిని పి.ఎం 2.5, పది మైక్రోమీటర్ల పరిమాణం ఉన్నవి పి.ఎం 10గా పేర్కొంటారు. నిర్మాణాలు జరుగుతున్న చోట, కచ్చా రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలు, మంటలు, వివిధ రకాల పొగల నుంచి ఇవి ఏర్పడతాయి. సల్ఫర్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ వంటి ప్రమాదకర వాయువులు పవర్‌ ప్లాంట్లు, పరిశ్రమలు, వాహనాల నుంచి ఇవి ఎక్కువగా వెలువడతాయి. గాలిలో కాలుష్యకారకమైన సూక్ష్మాతి సూక్ష్మమైన ధూళి కణాలు పి.ఎం 2.5 అంశంలో కూడా భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. పి.ఎం 2.5 గాలిలో 7.5 నుంచి 8.5 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు లెక్క. గ్లోబల్‌ ఎయిర్‌ నివేదిక ప్రకారం భారత్‌లో 8.3 వరకు ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలోని 93 శాతం విస్తీర్ణంలో క్యూబిక్‌ మీటరుకు 10 మైక్రోగ్రాముల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాల కంటే భారతదేశం పి.ఎం 2.5 కాలుష్యం చాలా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం మనుషులు ఏడాదిపాటు పీల్చే గాలిలో 2.5 పి.ఎం రేణువులు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. 10 పి.ఎం రేణువులు 15 గ్రాములు దాటకూడదు. నైట్రోజన్‌ ఆక్సైడ్‌ సాంద్రత ఏడాదికి పది గ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ ప్రపంచంలో చాలా వరకు అధికాదాయ దేశాల్లోని నగరాలు ఈ స్థాయిలను ఎప్పుడో దాటి ప్రమాదకర స్థితికి వెళ్లిపోయాయి.
     1998-2018 మధ్యలో పరిశీలిస్తే భారతీయులు సగటున 1.80 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయారు. 2018 నాటి వాయు కాలుష్యమే ఇప్పుడు కూడా కొనసాగితే రాబోయే కాలంలో సగటు భారతీయుని జీవిత కాలం 5.20 ఏళ్లు తగ్గిపోతుందని హెచ్చరికలు చేసినా కూడా ప్రభుత్వాలు ఈ విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పవచ్చు. దీనివలన దేశంలో 84 శాతం మంది నిర్దేశించిన వాయు కాలుష్య ప్రమాణాల కంటే దిగజారిన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. మన దేశంలో వాయు కాలుష్యం తీవ్రత దక్షిణ భారతం కంటే ఉత్తర భారతంలో చాలా ఎక్కువగా ఉంది. అక్కడ 24.80 కోట్ల మంది భారతీయుల సగటు జీవితకాలం 8 ఏళ్లు హరించుకుపోతుందని ఒక అధ్యయనం తెలిపింది. ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోవాసులు మాత్రం అత్యధికంగా ఆయు:ప్రమాణాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుత వాయు కాలుష్యం ఇలాగే కొనసాగితే ఇక్కడి వాసులు సగటున 10.30 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోతారని పర్యావరణవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. దక్షిణ భారతంలో చూస్తే తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా తరువాత స్థానాల్లో వరుసగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ ఉన్నాయి. గాలి కలుషితమై పసిపిల్లల ఉసురు తీస్తున్న దేశాల విషయంలో కూడా భారత్‌ లోనే అత్యధికం. 2019లో 1,16,000 మంది చిన్నారులు భూమ్మీదకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. భారత్‌ తర్వాత స్థానంలో నైజీరియా (67,900 మంది పిల్లల మృతి), పాకిస్తాన్‌ (56,500), ఇథియోపియా (22,900), డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (1,200) ఉన్నాయి.
     షికాగో యూనివర్సిటీ 'ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌' పేరిట నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం ప్రకారం భారతీయుల సగటు జీవితకాలం ఏకంగా 5 సంవత్సరాలు హరించేస్తుంది. అంతే కాదు. దీని ప్రభావం వలన భారత్‌లో గర్భస్రావాల ముప్పు కూడా అధికంగా ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాయు కాలుష్యం అనేది అత్యంత తీవ్రమైన విషయమైనప్పటికీ కాలుష్యాన్ని నివారించడంలో అంతర్జాతీయ స్థాయిలో పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే, వీటిపై ప్రజల్లో అవగాహన తేవడానికి పెద్ద ఎత్తున సదస్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కాలుష్యాన్ని అరికట్టడానికి వాటికి అవసరమైన నిధులు కేటాయింపులో పెరుగుదల నామమాత్రంగానే ఉందని లాన్సెట్‌ నివేదిక స్పష్టం చేసింది. భారత్‌లో వాయు కాలుష్య నివారణకు బలమైన కేంద్రీయ వ్యవస్థ మాత్రం లేదని నివేదిక తెలిపింది. భారతదేశంలో కాలుష్యం డబ్ల్యుహెచ్‌ఒ మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉందని...ఇదే పరిస్థితి కొనసాగితే...రాబోయే కాలంలో మరింత ప్రమాదం ముంచుకొస్తుందనడంలో సందేహం లేదు.
 

రుద్రరాజు శ్రీనివాసరాజు,
సెల్‌ : 9441239578