* సముద్రంలో మునిగి బాలిక మృతి
* విలపిస్తున్న తల్లిదండ్రులు
ఆడుతూ.. పాడుతూ తమ కళ్లెదుటే తిరుగాడే తమ గారాల పట్టి ఇక లేదనే వాస్తవాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఇంటి మహాలక్ష్మి మరలా రాని లోకాలకు వెళ్లిపోయిందనే చేదు నిజం వారి గుండెలను పిండేస్తోంది. మేనత్త సముద్రానికి వెళ్తుందని తెలిసి తల్లిదండ్రులకు తెలియకుండా స్నేహితులతో కలిసి సముద్రానికి వెళ్లిన సుంకు అక్షయ (12) అలల తాకిడికి బలైంది.
ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు/పలాస: వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర్ బీచ్ సముద్రంలో ఆదివారం సాయంత్రం మునిగి ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి సుంకు అక్షయ (12) మృతి చెందగా, మరో విద్యార్థి చింతాడ రాజేశ్వరి అస్వస్థతకు గురైంది. స్థానికులు, వజ్రపుకొత్తూరు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాశీబుగ్గ మారుతీ నగర్ తాళాసు రంగారావు కోటర్స్‌లో సుంకు అర్జున్, కృష్ణవేణి నివాసం ఉంటున్నారు. సుంకు అక్షయ ఇంటి వద్ద ఆడుతున్న సమయంలో తన మేనత్త అక్కుపల్లి బీచ్‌కు వెళ్లితున్నారని తెలిసి తన తల్లిదండ్రులకు చెప్పకుండా తన స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లింది. బీచ్‌లో అందరూ స్నానాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన అలలు తాకిడికి సుంకు అక్షయ, చింతాడ రాజేశ్వరి సముద్రం లోపలికి కొట్టుకుపోయారు. వెంటనే స్థానికులు ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే అక్షయ మృతి చెందింది. రాజేశ్వరి అస్వస్థతకు గురికావడంతో వెంటనే పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మేఘన వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం రాజేశ్వరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అక్షయ సముద్రంలో మునిగి చనిపోయిందని విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. విగత జీవిగా ఉన్న అక్షయను చూసి తల్లిదండ్రులు నేలపై పడి కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యం పలువురిని కంట తడి పెట్టించింది. అక్షయ కాశీబుగ్గ సాయికాలనీలో ఏడో తరగతి చదువుతుంది. మృతురాలి తల్లిదండ్రులు ఓ జీడి పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. మృతురాలికి అన్నయ్య ఉన్నారు. అక్షయ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వజ్రపు కొత్తూరు ఎస్‌ఐ మధుసూదనరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










