ప్రజాశక్తి-కనిగిరి: దేశంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం ప్రవేశ పెట్టినట్లు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. సోమవారం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఏడో సచివాలయం కాశిరెడ్డి కాలనీలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం హెల్త్ సెక్రటరీ లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ హాజరై మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ద్వారా ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా నిర్దేశిత జాబితాలో ఉన్న ఆసుపత్రులల్లో పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రభుత్వ / ప్రైవేట్ ఆసుపత్రులల్లో లబ్ధిదారులకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ 108, 104 ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. నాలుగడుగులు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యానికి పెద్దపీట వేసి ఆరోగ్యమే మహాభాగ్యమని, ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశారని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ పంపిణీ చేశారు. ప్రతి వ్యక్తి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం అడ్మిన్ సునీల్ కుమార్, హెల్త్ సెక్రటరీ లక్ష్మి, వార్డు వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు.