ప్రజాశక్తి-చింతూరు
పురాతన కాలం నుండి మానవాళికి ఉపయోగపడుతున్న ఆయుర్వేద వైద్య విధానంపై ప్రజలకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్ ఆయుర్వేద ఔషధ వనమూలిక వైద్య సేవలను గుర్తించి ఆయన్ను తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవ మనుగడకు అవసరమయ్యే వనమూలిక ఔషధ మొక్కలను నాటి, ఆ వైద్యంపై ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి భావి తరాలకు ప్రాణ వాయువును అందించాలని సూచించారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇలాంటి వైద్యం అందించడానికి హైదరాబాద్ వంటి మహానగరంలో కూడా క్యాంపులు నిర్వహించాలని కోరారు. దీనికి స్పందించిన డాక్టర్ జమాల్ ఖాన్ మాట్లాడుతూ వనమూలికలు సరిపడా లభించడం లేదని, సిబ్బంది, మరికొంత మంది వైద్యులు అవసరం ఉంటుందని తెలిపారు. కొంత మంది అల్లోపతి వైద్యులకు ఆయుర్వేదంలో శిక్షణ ఇచ్చి తద్వారా ఎక్కువ మంది రోగులకు ఆయుర్వేద వైద్యం అందించాలన్నారు. మనిషి స్వార్థానికి అడవులను విచక్షారహితంగా నరికి వేయడంతో ఎంతో విలువైన ఔషధ మొక్కలు అంతరించి పోయాయని తెలిపారు. దీనికి స్పందించిన మంత్రి.., ఏ మేరకు ఔషధ మొక్కలు అవసరం ఉంటాయో తెలియజేస్తే అటవీశాఖ వారికి ఆదేశాలు జారీ చేసి, ఔషధ మొక్కలు పంపిణీ చేసే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ముస్లిం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముజాహిద్ హుస్సేన్, బిఆర్‌ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి మానే రామకృష్ణ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి, ఎస్‌కె.షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.










