Sep 18,2023 00:22

ప్రజాశక్తి - భట్టిప్రోలు
గ్రామంలో 75ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్యశాల నేడు ప్రజలకు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ప్రాథమిక వైద్యశాలలు లేని సమయంలో ఈ వైద్యశాల మండల ప్రజానీకానికి ఏకైక వైద్యశాల. గతంలో అన్ని రకాల వ్యాధులకు ఇక్కడ చికిత్స అందించేవారు. ప్రాథమిక వైద్యశాలు ఏర్పాటు చేసిన అనంతరం దీనిని ఆయుర్వేద వైద్యశాలుగా మార్చారు. అప్పటి నుండి అనేకమందికి ఆయుర్వేద చికిత్సలు అందిస్తూ వచ్చింది. కానీ గత నాలుగైదు ఏళ్లుగా ఈ వైద్యశాలకు వైద్యులు లేకపోవడం, దూర ప్రాంతాల నుండి ఇన్చార్జిలుగా కేటాయించబడిన వాళ్లు ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితిలో ప్రజలు కూడా వైద్యశాలను మర్చిపోయే స్థితి వచ్చింది. వైద్యశాల ప్రాంగణం పల్లపు ప్రాంతం కావడంతో పట్టించుకునే వాళ్లు లేక చుట్టుపక్కల వర్షం నీరు చేరి లోపలికి వెళ్లడానికి కూడా అవకాశం లేని విధంగా మోకాలి లోతు నీళ్లు నిలిచాయి. ఇప్పటికీ కొంతమంది ఆయుర్వేద వైద్యాన్ని నమ్ముకుని చికిత్సలు పొందుతుంటారు. కానీ వైద్యులు లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు వైద్యశాలపై దృష్టి సారించి శాశ్వత వైద్యులను నియమించాలని, వైద్యశాల ప్రాంగణానికి మెరక తోలించి అభివృద్ధిపరిస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. వైద్యశాల అభివృద్ది చేయాలని ప్రజాసంఘాల ప్రతినిదులు తహశీల్దారుకు వినతి పత్రం అందజేశారు.