ప్రజాశక్తి కథనానికి స్పందన
ప్రజాశక్తి - భట్టిప్రోలు
గ్రామంలో గత 75ఏళ్లుగా సేవలందించిన ఆయుర్వేద వైద్యశాల శిథిలవస్తుకు చేరి నిరుపయోగంగా మారిందనే సమస్యపై ఈనెల 18న "ఆయుర్వేద వైద్యశాలపై అధికారుల నిర్లక్ష్యం" అనే శీర్షికతో ప్రజాశక్తిలో కదనం వెలువడింది. దీనికి అధికారులు స్పందించారు. ఆయుష్ రాష్ట్ర కమిషనర్ ఎల్ రాజేంద్ర కుమార్ తన బృందంతో వైద్యశాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ ఈ వైద్యశాల పూర్తిగా శిధిలావస్థకు చేరిందని అన్నారు. దీనిని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌గా ఏర్పాటు చేసేందుకు రూ.30లక్షల నిదులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో నూతన భవనం ఏర్పాటు చేసి యోగా శిక్షణ ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో 110ఆయుర్వేద వైద్యశాలలను ఆధునికరిస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్క వైద్యశాలకు రూ.5లక్షల చొప్పున మంజూరు చేసి పూర్తి హంగులతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్ళుగా భట్టిప్రోలులో ఉన్న ఈ వైద్యశాలను పూర్తి హంగులతో ఆధునీకరించటమే కాక ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మార్చుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వై శేఖర్, అకౌంటెంట్ భుజంగరావు, కన్సల్టెంట్ డాక్టర్ రంగనాథ్, డాక్టర్ పద్మజ ఉన్నారు.










