Oct 17,2023 21:04

డాక్టర్‌ రేణుదీక్షిత్‌

ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాల వ్యాధులు నయం
డాక్టర్‌ రేణుదీక్షిత్‌
ప్రజాశక్తి - తిరుమల
వైద్యవిధానమైన ఆయుర్వేదానికి టీటీడీ ఊతమిస్తోందని, పంచకర్మ ద్వారా దీర్ఘకాల రోగాలను శాశ్వతంగా నయం చేయవచ్చని, శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన ఆయుర్వేద వైద్యం అందిస్తున్నామని ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రేణుదీక్షిత్‌ తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో మంగళవారం ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రేణుదీక్షిత్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రేణుదీక్షిత్‌ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మౌత్సవాలలో టీటీడీ అందిస్తున్న ఆయుర్వేద వైద్యానికి భక్తుల నుండి విశేష స్పందన వస్తోందని తెలిపారు. కల్యాణ వేదిక చెంత ఏర్పాటు చేసిన ఆయుర్వేద ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. ఇందులో ఔషధగుణాలున్న మొక్కలను, వాటిని ఏవిధంగా ఉపయోగించాలి, ఏ వ్యాధికి ఉపయోగించాలనే విషయాలను సవివరంగా వివరిస్తూ ప్రదర్శన ఏర్పాటు చేశామని వివరించారు.
అదే విధంగా బ్రహ్మౌత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం శ్రీ వరహస్వామి అతిథి భవనం పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం, సిఆర్‌వో, లేపాక్షి దగ్గర ఉన్న ప్రథమ చికిత్స కేంద్రాలలో ప్రతిరోజూ దాదాపు 1000 మంది భక్తులకు వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసిలో మొత్తం 314 రకాల ఫార్ములాలకు ఆయుష్‌ శాఖ నుండి అనుమతి లభించిందని, వీటిలో 60 రకాల మందులు మొదటి దశలో ఉత్పత్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. షుగరు, బిపి లాంటి దీర్ఘకాల రోగాలకు సంబంధించి ఆయుర్వేద మందుల ద్వారా నయం చేయడానికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌ అనంతర పరిణామాల నేపథ్యంలో ఆయుర్వేద వైద్యానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోందన్నారు. అదేవిధంగా పంచకర్మ చికిత్స విధానం ద్వారా 5 రకాల మలినాలను శరీరం నుండి తొలగించేలా వైద్యసేవలు అందిస్తున్నామన్నామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఎపిఆర్వో పి.నీలిమ పాల్గొన్నారు.