- రూట్ ఆఫ్ ఆడ్మినిస్ట్రేషన్ ఆధారంగా వైద్యం
- దీర్ఘకాలిక వ్యాధులకు సరైన చికిత్స
- జిల్లాలో 14 డిస్పెన్షరీల ద్వారా వైద్య సేవలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ఆయుర్వేద వైద్యంపై అపోహలు వీడాలని ప్రభుత్వ ఆయుష్ విభాగం సీనియర్ వైద్యాధికారి పి.జగదీష్ అన్నారు. వైద్య రంగంలో అతి ప్రాచీనమైన ఆయుష్ వైద్యం దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేందుకు తోడ్పడుతోందన్నారు. రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆధారంగా వైద్యం అందించి రోగాలను నయం చేయనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 14 డిస్పెన్షరీల్లో ఆయుర్వేద వైద్యం, 12 డిస్పెన్షరీల ద్వారా హోమియో, రెండు చోట్ల యునానీ డిస్పెన్షరీలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. అన్నిచోట్లా రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆయుష్ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలగడానికి తీసుకుంటున్న చర్యలు, ఇతర అంశాలపై ఆయన 'ప్రజాశక్తి'తో మాట్లాడారు.
ఆయుష్ శాఖ దాఆరా జిల్లాలో అందుతున్న వైద్యసేవలు ఎలా ఉన్నాయి?
ఆయుష్ రంగంలో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. ప్రాచీన వైద్యరంగంలో ఆయుష్ ఎంతో కీలకం. సహజసిద్ధంగా లభించే మూలికలు, ఆకులు, ఇతర రసాలతో వైద్యసేవలు అందించడం జరుగుతుంది. మందుల్లో ఇతర రసాయనాలకు తావుండదు. అందువల్ల సైడ్‌ఎఫెక్ట్స్ ఎంతమాత్రం ఉండదు. ఈ మందులు వాడుతున్న వారిలో కొన్ని అపోహలు ఉన్నాయి. మందులు వాడినా ఆలస్యంగా తగ్గుతుందని కొందరు... వేడి, చలువ చేస్తుందని మరికొందరు, పత్యం ఎక్కువగా ఉండాలని ఇంకొందరు అపోహ పడుతుంటారు. మందుల వల్ల ఎప్పుడూ వేడి, చలువ రాదు. రోగం ప్రభావం, వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. దీనికితోడు అత్యవసరం తగ్గాలనుకునే వారు ఈ మందులు వినియోగించడం ఆలస్యమవుతోందని మళ్లీ ఇంగ్లీషు మందులు వాడడం జరుగుతోంది. ఆలస్యంగా తగ్గినా మరోసారి అటువంటి వ్యాధికి గురికాకుండా ఉండేందుకు ఈ మందుల వాడకం ఎంతో ఉపయోగపడుతుంది.
ఆలస్యంగా తగ్గడానికి గల కారణాలేమైనా ఉన్నాయా?
ఆయుష్ వైద్యంలో ప్రదానంగా ఇంజక్షన్ అనేది ఉండదు. నోటి మాత్రలు, లేహం, పౌడర్లు, సిరప్, లేపనం, ఆయిల్స్ మాత్రమే ఉంటాయి. వీటి వల్ల శరీరంలో మందుల ప్రభావం చూపడానికి కొంత సమయం పడుతుంది. ఇంజక్షన్ల వాడకం వల్ల గంటల వ్యవధిలో తాత్కాలిక ఉపశమనం ఉంటుంది. అందువల్ల ప్రజలు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఆయుష్ వైద్యం కోసం ప్రత్యేకమైన రోగులు వస్తుంటారు. వారు వ్యాధి ఆలస్యంగా తగ్గినా శాశ్వత ఉపశమనం దొరుకుంతుందన్న భావనతోనే డిస్పెన్షరీలకు వస్తున్నారు. వారు తీసుకున్న మందులు క్రమం తప్పకుండా వాడడం వల్ల ఉపశమనం లభిస్తోంది. అందువల్లే ఈ వైద్యానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఉంది.
ఆయుష్ విభాగం ద్వారా ఎంతమంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు?
ఆయుష్ పరిధిలో 14 ఆయుర్వేద డిస్పెన్షరీలు, 12 హోమియో, రెండు యునానీ డిస్పెన్షరీలు ఉన్నాయి. వాటికితోడు కొత్తగా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా మూడు ఆయుర్వేదం, ఐదు హోమియో డిస్పెన్షరీలను కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్నారు. ఆయుష్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల ద్వారా మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడమైంది. వీటికితోడు పక్షవాతం, కీళ్లు, కండరాల సంబంధిత వ్యాధులు, రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారికి కోటబొమ్మాళి కేంద్రంగా పంచకర్మ యోగా థెరఫీ కేంద్రం ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. ఇందులో ఇన్‌పెషెంట్లు ఉండి దీర్ఘకాలం పాటు వైద్యం పొందుతారు. యోగా, మెడిటేషన్ కూడా అందుబాటులో ఉంది.
పంచకర్మ థెరఫీ అంటే ఎలా సాగుతుంది?
రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు, చేతులు, ఇతర ఎముకలు విరిగిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. వీరితోపాటు పక్షవాతంతో బాధపడుతున్న వారికి ఆయుర్వేద సిద్ద వైద్య ప్రక్రియ నిర్వహించడం ద్వారా నయం చేయడానికి వీలుంటుంది. అటువంటి రోగులకు వమనం, విరేచనం, వస్తి, ససేకర్మ, జులుకా (రక్తమోక్షం) వంటి థెరపీలు నిర్వహించడం ద్వారా తిరిగి నడిచేందుకు వీలుగా వైద్యం అందిస్తున్నాం.
పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో ఉన్నారా?
ఆయుష్ శాఖ పరిధిలోని ఆయుర్వేదిక్ డిస్పెన్షరీల్లో తొమ్మిది మంది వైద్యులు పనిచేస్తుండగా, ఐదు చోట్ల వైద్యులు లేరు. హోమియోలో ఐదుగురు మాత్రమే పనిచేస్తుండగా ఏడుగురు వైద్యుల ఖాళీగా ఉన్నాయి. యునాని రెండు డిస్పెన్షరీలు ఉన్నా రెండుచోట్ల వైద్యులు లేరు. సిబ్బంది కొరత అదే స్థాయిలో ఉంది. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పరిధిలోని అన్ని పోస్టుల్లో వైద్యులు అందుబాటులో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున మందులు క్రమం తప్పకుండా సరఫరా చేస్తుండడం వల్ల రోగులకు పూర్తిస్థాయి వైద్యం అదిస్తున్నాం.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు ఎలా అందిస్తున్నారు?
ప్రతి డిస్పెన్షరీ పరిధిని ఒక గ్రామాన్ని వైద్యులు దత్తత తీసుకుని ఆ గ్రామంలో నూటికి నూరు శాతం ఆయుర్వేదం, హోమియో, యునానీ మూడింటిలో ఏదో ఒక వైద్యం మాత్రమే అందించి, అన్ని రోగాలను నయం చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలో 30 గ్రామాలు దత్తత తీసుకుని వైద్యం అందిస్తున్నాం. ప్రజల్లో అపోహలు తొలగించేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం.










