Dec 04,2022 22:28

ఆందోళన వ్యక్తం చేస్తూన్న మహిళలు

ప్రజాశక్తి -కొత్తకోట:రావికమతం మండలం మేజర్‌ పంచాయతీ కొత్తకోటలో జగనన్న గృహ లబ్ధిదారుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. ఏడాది కాలంగా ఇళ్ల నిర్మాణానికి నోచుకోక పోవడంతో పలువురు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన సుమారు 240 మంది పేదలకు జగనన్న గృహ పథకంలో భాగంగా దిబ్బలపాలెం సమీపంలో స్థలం కొనుగోలు చేసి ప్రభుత్వం పంపిణి చేసింది. ఇందులో సుమారు 106 మంది పేదలు సొంతంగా ఇల్లు నిర్మాణం చేసుకోలేక చోడవరానికి చెందిన ఓ సంస్థకు కాంట్రాక్ట్‌ పద్దతిలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే లక్షా 80 వేలతో పాటు లబ్ధిదారుని వాటాగా మరో లక్షా 50 వేలు కలిపి ఇచ్చేందుకు తీర్మానం చేసుకున్నారు. మొదటి దపాగా ఒక్కో లబ్ధిదారుడు రూ.25 వేల చొప్పున స్థానిక వైసీపీ నాయకులు మధ్య వర్తిత్వంతో చెల్లించారు. దీనికి స్థానిక నాయకుల రసీదులు కూడా ఇప్పించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా సంస్థ ద్వారా నిర్మాణ పనులు సాగక పోవడంతో లబ్ధిదారులు పలు మార్లు స్థానిక పంచాయతీ కార్యాల యం వద్ద అందోళన చేశారు. ఇల్లు అయినా నిర్మించండి లేదా సొమ్ము అయినా తిరిగి ఇవ్వండి అంటూ నిలదీయడంతో స్థానిక నాయకులు సర్ది చెప్పుతూ వస్తున్నారు. కానీ ఇల్లు నిర్మాణ పనులు జరగ లేదు. దీంతో, ఎప్పుడు పనులు జరుగుతాయోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.